ఫోన్లో ఇలా చెల్లింపులు చేస్తే.. మోసపోతారు..

Spread the love

సరైన, నకిలీ యుపిఐ యాప్ ల గురించి మీకు తెలుసా…

ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా సురక్షితంగా ఉండండి..

ఈ రోజుల్లో అంతా డబ్బులు భౌతికంగా ఇవ్వకుండానే ఫోన్ల ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. దీని వల్ల సులువుగా చెల్లింపులు చేయొచ్చు, అదే సమయంలో అజాగ్రత్తగా ఉంటే మోసపోతాం కూడా. ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం సర్వసాధారణం అయిపోయాయి. ఈ యాప్లలో యుపిఐ అనే మాద్యం ద్వారా చెల్లింపులు చేస్తాం. ఆన్లైన్ చెల్లింపుల్లో ఎలా చేస్తే సురక్షితంగా ఉంటాం, దేని వల్ల మోసపోతాం.. వివరంగా తెలుసుకుందాం..

పిన్(PIN) ను ఎవరికీ చెప్పవద్దు

చాలా మంది కస్టమర్‌లు పిన్(PIN) ఫిర్యాదులు చేస్తారు. పిన్‌(PIN)ను షేర్ చేసినందుకు డబ్బు వస్తుందని మెసేజ్ లేదా మెయిల్ లు వస్తాయి. బ్యాంక్ వారు పిన్‌ని అడగరు గుర్తుంచుకోండి. పిన్ పంపితే డబ్బు పంపిస్తామంటూ మోసగాళ్లు మోసం చేస్తున్నారు.

గుర్తుతెలియని కాల్స్ కు స్పందించవద్దు

ఎవరైనా తెలియని నంబర్ ద్వారా మీతో ఫోన్‌లో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే, అలాంటి వారి దూరంగా ఉండండి. బహిరంగంగా ఎవరైనా మీకు ఫోన్ నంబర్‌ను ఇచ్చినట్లయితే, మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు అతన్ని బాగా గమనించండి.

నకిలీ యుపిఐ(UPI) యాప్‌లు

ఈ మధ్య నకిలీ యాప్ ల ద్వారా మోసాలు ఎక్కువయ్యాయి. చాలా మంది మోసగాళ్లు నకిలీ యుపిఐ(UPI) యాప్‌లను సృష్టించి, వాటి ద్వారా మోసం చేస్తున్నారు. ఇలా నకిలీ యాప్ లను డౌన్ లోన్ చేసుకోవడం వల్ల వారు మీ సమాచారాన్ని సేకరించి దుర్వినియోగం చేస్తారు. ఈ యాప్‌లు చూసేందుకు అసలైనవిగా కనిపిస్తాయి. దీంతో మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేస్తారు.

 మోడీ భీమ్(MODI BHIM), భీమ్ మోడీ యాప్(BHIM MODI APP), భీమ్ పేమెంట్-యుపిఐ గైడ్(BHIM PAYMENT-UPI GUIDE), భీమ్ బ్యాంకింగ్ గైడ్(BHIM BANKING GUIDE) వంటి నకిలీ యుపిఐ యాప్‌ల పట్ల వినియోగదారులు జాగ్రత్త వహించాలని సిటీ బ్యాంక్ సూచించింది.

నేరస్థులు జిమ్మిక్కులను ఉపయోగిస్తున్నారు. వారి యుపిఐ(UPI) వాలెట్లలో పేమెంట్ రిక్వెస్ట్ (చెల్లింపు అభ్యర్థనల)ను పంపడం ద్వారా వినియోగదారులను మోసగిస్తున్నారు. పోన్లో యాప్ ద్వారా చెల్లింపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

 నిజమైన, నకిలీ యాప్‌లను గుర్తించడం ఎలా..?

ప్రస్తుతం మార్కెట్‌లో ప్రతిదానికీ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఫిట్‌నెస్ నుంచి జాతకం, ఆరోగ్యం అన్నింటికి యాప్ లు ఉన్నాయి. మీ ఫేస్‌బుక్ పాస్‌వర్డ్, లాగిన్ ఐడీని తెలుసుకునే యాప్‌లు గూగుల్ ప్లేస్టోర్‌లో ఉన్నాయని ఇటీవల వెల్లడైంది. యాప్‌లు సరైనవా, నకిలీనా తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం కొన్ని సూచనలు..

స్పెల్లింగ్ లో తేడా..

నకిలీ యాప్ లకు అక్షరాలు అంటే స్పెల్లింగ్ లో తేడా ఉంటుంది. అవి ఒరిజినల్ లా ఉంటాయి, కానీ స్పెల్లింగ్‌లో పదాన్ని పెంచడం లేదా తగ్గించడం ఉంటుంది. ఇకా నకిలీ యాప్ లకు స్పెల్లింగ్ పేరు ప్రారంభంలో, ముగింపు లేదా మధ్యలో చిన్న మార్పులు చేస్తారు. కాబట్టి మీరు దానిని గుర్తించాలి. 

రేటింగ్‌లు, డౌన్‌లోడ్‌లను తనిఖీ చేయాలి..

ముఖ్యంగా మీరు గూగుల్ ప్లేస్టోర్(Google Play Store) నుండి డౌన్‌లోడ్ చేయబోయే ముందు యాప్‌ల సమీక్షలు, రేటింగ్‌లు, డౌన్‌లోడ్‌లను తనిఖీ చేయండి. పబ్లిష్ తేదీ కాకుండా యాప్ ప్రచురణ తేదీకి కూడా శ్రద్ధ వహించాలి  కొత్త యాప్ అయితే, దాని ప్రచురణ తేదీ కూడా కొత్తగా ఉండాలి.

రివ్యూస్, వివరాలు
 యాప్ కు సంబంధించిన వివరాలు ముందు తెలుసుకోవాలి. ఆ తర్వాత రివ్యూలు అంటే డౌన్ లోడ్ చేసుకున్న వారి అభిప్రాయాలు చూడాలి.   

ఎలాంటి అనుమతి అడుగుతుంది..
 యాప్ ను డౌన్లోడ్ చేసుకునే ముందు మీ నుండి ఎలాంటి అనుమతి అడుగుతుందో చూడాలి. యాప్ మిమ్మల్ని సాధారణం కంటే ఎక్కువ సమాచారం అడుగుతున్నట్లయితే, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. 

 బ్రౌజర్‌లో స్టోర్ వెబ్‌సైట్
 గూగుల్ ప్లేస్టోర్ నుంచి డైరెక్ట్ గా కాకుండా మీరు బ్రౌజర్‌లో స్టోర్ వెబ్‌సైట్‌కి వెళ్లి ‘మా యాప్ పొందండి’ ఎంపిక కోసం వెతకవచ్చు. అది మిమ్మల్ని సంబంధిత యాప్‌కి తీసుకెళ్తుంది, అక్కడ మీకు అధికారిక, ధృవీకరించిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 
ఆన్ లైన్ చెల్లింపు మోసాలు, రకాలు

తప్పు పేరుతో UPI యాప్ లు

మోసగాళ్లు తప్పు యుపిఐ పేరుతో యాప్ లను సృష్టించి డబ్బును దొంగిలిస్తారు. UPI లేదా BHIM పదాలను ఉపయోగించి తప్పు పేర్లతో మోసగిస్తారు. వీటి గురించి పైన వివరంగా తెలుసుకున్నాం.

ఫిషింగ్ స్కామ్ 

ఫిషింగ్ స్కామ్‌లు అంటే మోసగాళ్లు నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టించి, వాటిని అధికారిక వెబ్‌సైట్‌ల లాగా కనిపించేలా చేస్తారు. ఈ సైట్‌లకు చెల్లింపు లింక్‌లను టెక్స్ట్ లేదా ఎస్ఎంఎస్(SMS) ద్వారా పంపుతారు. ఈ వెబ్ సైట్లో లింక్ లను వ్యక్తులు క్లిక్ చేస్తే అంతే, వారి ఉచ్చులో పడినట్టే. ఈ చెల్లింపు లింక్‌లు క్లిక్ చేస్తే వెంటనే యుపిఐ(UPI) యాప్‌కి అభ్యర్థనలను వస్తాయి. మనం వాటికి ఓకే అంటే ఆమోదించినప్పుడు డబ్బు ఇ-వాలెట్ నుండి డెబిట్ అవుతాయి.

UPI పిన్ లేదా OTP తో మోసాలు

మోసగాళ్లు కస్టమర్‌లకు కాల్ చేసి యాప్ సపోర్ట్ కోసం మీ ఫోన్‌లలో పంపిన యుపిఐ ఒటిపి(OTP)ని షేర్ చేయమని అడుగుతారు.  బ్యాంక్ ఉద్యోగిగా నటించి, మీకు ఫోన్ చేస్తారు. లావాదేవీలను ఒకసారి పరిశీలించుకోమని చెప్తారు. పిన్‌ని రీసెట్ చేయమని అడగవచ్చు. మీ ప్రస్తుత పిన్ గురించి అడిగి తద్వారా వినియోగదారులను మోసం చేస్తారు. బ్యాంకు ఉద్యోగులమని, వివరాలను అడిగితే, వాటికి దూరంగా ఉండాలి.

క్యూఆర్ కోడ్ స్కానింగ్

మోసగాళ్లు కస్టమర్‌లకు క్యూఆర్(QR) కోడ్‌ని పంపి, దానిని స్కాన్ చేయమని అడుగుతారు. స్కాన్ చేయడానికి వినియోగదారు యుపిఐ యాప్‌ని ఉపయోగించినప్పుడు, అది ఆటోమేటిక్‌గా లావాదేవీని ప్రారంభిస్తుంది. మీరు ఇలాంటి అభ్యర్థనను పొందినట్లయితే, వాటిని పట్టించుకోవద్దు.

సోషల్ మీడియా UPI మోసాలు 

ఇటీవల సోషల్ మీడియా యుపిఐ మోసాలు పెరుగుతున్నాయి. మిమ్మల్ని ఫోన్‌లలో టీమ్ వ్యూయర్(TeamViewer) వంటి స్క్రీన్ షేరింగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచిస్తారు. వెరిఫికేషన్ కోసం వెబ్‌క్యామ్ ముందు తమ క్రెడిట్, డెబిట్ కార్డ్‌ని పట్టుకోవాల్సి ఉంటుంది. మోసగాళ్లు ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి ఎస్ఎంఎస్(SMS) ద్వారా స్వీకరించే OTPని షేర్ చేయమని అడుగుతారు. వినియోగదారులు వివరాలను పంచుకున్న తర్వాత వారి ఖాతాల నుండి డబ్బును ఖాళీ చేస్తారు.

ఎస్ఎంఎస్(SMS) మోసాలు 

మిమ్మల్ని యుపిఐ(UPI) లాగిన్ ఆధారాలను అప్‌డేట్ చేయమని, లేదా యాప్‌ అప్‌డేట్ చేయమని మీ ఫోన్‌లో సందేశాన్ని పంపుతారు. ఎస్ఎంఎస్(SMS)లో మోసపూరిత లింక్‌ పంపుతారు. దానిపై క్లిక్ చేయడం వలన మీ ఫోన్‌కు మాల్వేర్ లేదా వైరస్‌లు వెళతాయి. వివరాలను తస్కరించి మోసం చేస్తారు. అందుకే యాప్‌ని ఎల్లప్పుడూ అప్‌డేట్ చేయండి. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

మోసపోతే ఏం చేయాలి..?

మీ యుపిఐ (UPI) సమాచారం కోసం సోషల్ మీడియా వెబ్‌సైట్‌లు, ఇంటర్నెట్ ఫోరమ్‌లలో ఉన్న కస్టమర్ సపోర్ట్ నంబర్‌లను ఉపయోగించవద్దు. ఎల్లప్పుడూ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

మోసానికి గురైనట్లయితే మీ యుపిఐ లావాదేవీ వివరాలు, క్రెడిట్, డెబిట్ కార్డ్ నంబర్‌ను తీసుకుని మీకు దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయండి. పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. అలాగే మోసపోయిన విషయాన్ని, లావాదేవీ వివరాలను వెంటనే బ్యాంక్ అధికారులకు తెలియజేయండి. మోసగాళ్లు మీకు ఫోన్ చేసి ఉంటే మీ ఫోన్ కాల్‌ని రికార్డ్ ను చూపించండి. దీనివల్ల మీకు జరిగిన మోసానికి సంబంధించి రుజువు ఉంటుంది.

మీ లావాదేవీ చరిత్ర స్క్రీన్‌షాట్‌ను జాగ్రత్త ఉండనివ్వండి. ఎందుకంటే మోసం జరిగినప్పుడు అది బ్యాంక్‌కు ఫార్వార్డ్ చేస్తారు. మోసగాళ్లు మీ పోస్ట్‌లను చూసి హాని కలిగిస్తారు, కావున యుపిఐ లావాదేవీల సమాచారాన్ని సోషల్ మీడియా లేదా వెబ్‌సైట్‌లలో పోస్ట్ చేయకూడదు.

మీ ఫోన్‌లోని యుపిఐ(UPI) యాప్ నుండి మీకు స్పామ్ హెచ్చరిక వస్తే, దానిని నిర్లక్ష్యం చేయవద్దు. యాప్ డెవలపర్‌లు ఈ నోటిఫికేషన్ హెచ్చరికల ద్వారా వినియోగదారులకు తెలియజేస్తారు, అందువల్ల దాని గురించి చదివి వివరంగా తెలుసుకోండి.

పేమెంట్ యాప్‌లకు టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌లు ఇవే?

ఫోన్ పే(PhonePe) కస్టమర్ సపోర్ట్ టీమ్ 080-68727374 కు సహాయం కోసం సంప్రదించవచ్చు. గూగుల్ పే(Google Pay) కస్టమర్ సపోర్ట్ టీమ్ 1-800-419-0157లో అందుబాటులో ఉంటుంది. బీమ్(BHIM) టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 8001201740. పేటీఎం (PayTM) 24X7 హెల్ప్‌లైన్‌ 0120-4456-456కు డయల్ చేయవచ్చు. ఇక భారత్ పే(BharatPe) కోసం కస్టమర్ కేర్ ఫోన్ నంబర్ 088825 55444 కు ఫోన్ అందుబాటులో ఉంది.

ఎక్కువగా వినియోగించే సురక్షితమై పేమెంట్ యాప్ లు ఇవే..

గూగుల్ పే

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కు చెందిన పేమెంట్ యాప్ ఈ గూగుల్ పే(Google Pay) సురక్షితమైంది. ఈ డిజిటల్ వాలెట్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులు దేశంలో చాలా జరుగుతున్నాయి. కరోనా సమయంలో ప్రజలు దీనిని ఎక్కువగా ఉపయోగించారు. ఇది తన కస్టమర్‌లకు అన్ని రకాల ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్‌లను కూడా అందిస్తోంది. గూగుల్ పేతో యుపిఐ చెల్లింపు చేయడానికి ముందుగా దాన్ని బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి.

ఫోన్ పే

ప్రస్తుతం ఫోన్ పే(PhonePe) యాప్ 11 భారతీయ భాషలలో అందుబాటులో ఉంది. దీంతో యుపిఐ లావాదేవీలతో పాటు అనేక ఇతర పనులను కూడా చేయవచ్చు. మొబైల్ రీఛార్జ్, బిల్లులు చెల్లించవచ్చు. ఇంకా పన్ను ఆదా నిధులలో పెట్టుబడి పెట్టవచ్చు. బీమా కొనుగోలు చేయవచ్చు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఫోన్ పేతో ఓలా(ola) క్యాబ్‌లను బుక్ చేసుకోవచ్చు, రెడ్ బస్(RedBus) చార్జీలు చెల్లించవచ్చు, విమానాల టికెట్లను, హోటల్‌లను బుక్ చేసుకోవచ్చు.

పేటీఎం

కరోనా కాలంలో  పేటీఎం(Paytm) చెల్లింపు బాగా జరిగాయి. చిన్న దుకాణం నుండి వీధి వ్యాపారుల వరకు చెల్లింపు ఈ పేటీఎంను వినియోగించుకున్నారు. దీంతో యుపిఐ చెల్లింపులు, దాదాపు అన్ని రకాల చెల్లింపులు చేయవచ్చు. ఇప్పుడు అద్దె చెల్లింపును కూడా పేటీఎంతో చేస్తున్నారు. పేటీఎం అనేది ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్, దీని నుండి మీరు అన్ని రకాల వస్తువులను కూడా కొనవచ్చు.

అమెజాన్ పే

ప్రముఖ ఇ-కామర్స్ సైట్ అమెజాన్ కూడా Amazon Pay పేరిట యుపిఐ చెల్లింపు సౌకర్యాన్ని అందిస్తోంది. అమెజాన్ ద్వారా అన్ని రకాల వస్తువుల కోసం షాపింగ్, చెల్లింపులు చేయవచ్చు. దీంతో అన్ని దుకాణాల్లో చెల్లింపులు జరుగుతున్నాయి.  ఇంకా ఆన్‌లైన్ షాపింగ్, రీఛార్జ్, గ్యాస్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్ వంటి బిల్లులను కూడా చెల్లించవచ్చు.

భీమ్(BHIM) యాప్

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూపొందించిన భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ (BHIM) యాప్ ద్వారా కూడా ఆన్ లైన్ చెల్లింపులు చేయవచ్చు. అంటే 2016 డిసెంబర్ 30న భీమ్‌రావు అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం ప్రారంభించిన యాప్ ఇది. ఇది మొబైల్ వాలెట్‌ వంటిది కాదు. మీరు దానిలో డబ్బును రీచార్జ్ చేయవచ్చు, నిల్వ చేయవచ్చు. దీంతో చెల్లింపులను మాత్రమే చేయడానికి వీలుంటుంది.


Spread the love

Leave a Comment

error: Content is protected !!