ఆర్బిఐ(RBI) రెపో రేటు పెంచింది.. ఇప్పుడు ఏం చేయాలి.. ?
దీనికి పరిష్కారం ఏమైనా ఉందా.. ?
భారం పెరగకుండా చేయవచ్చా.. ? ఒకసారి పూర్తిగా చదవండి..
ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) కేవలం నెల రోజుల వ్యవధిలోనే 0.90 శాతం రెపో రేటు పెంచింది. రెండుసార్లు 2022 మేలో 0.40 శాతం, 2022 జూన్ లో 0.90 శాతం పెంచింది. రెపో రేటు అంటే బ్యాంకులకు ఆర్బిఐ(RBI) ఇచ్చే నిధులపై వసూలు చేసే రేటు అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే.. రిజర్వు బ్యాంక్ నుంచి తెచ్చిన డబ్బే బ్యాంకులు మనకు రుణాలుగా ఇస్తాయి. మరి అలాంటి ఆర్బిఐనే రేటు పెంచితే బ్యాంకులు ఊరుకుంటాయా? పెంచేశాయ్ మరి.. ఇప్పుడు గృహ రుణాలతో పాటు అన్ని రకావ నెలసరి వాయిదాలు, అంటే ఇఎంఐలు పెరుగుతాయి. వీటి పరిష్కారం ఉందా? దీనికి ఎలాంటి చర్యలు చేపట్టవచ్చు? వడ్డీ భారం నుంచి తప్పించుకోవచ్చా? వంటి విషయాలను తెలుసుకుందాం…
రెపో రేటుకు ఇఎంఐకి లింకేంటి?
రెపో రేటు అనేది బ్యాంకులు ఆర్బిఐ నుండి రుణం పొందే రేటు. అయితే రివర్స్ రెపో రేటు అనేది ఆర్బిఐ డబ్బును ఉంచుకోవడంపై బ్యాంకులకు వడ్డీని చెల్లించే రేటు. రెపో రేటు పెరిగినప్పుడ, వడ్డీ రేట్లు పెరగడం వల్ల కస్టమర్‌కు రుణం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే వాణిజ్య బ్యాంకులు అధిక ధరలకు సెంట్రల్ బ్యాంక్ నుండి డబ్బును పొందుతాయి. దీంతో వారు(బ్యాంకులు) కూడా రేట్లు పెంచాల్సి వస్తుంది.
రెపో రేటు పెంపుతో ఇఎంఐలు అందరికీ పెరగవు…
రెపో రేటు పెరగడం వల్ల రుణాల ఇఎంఐలు అందరికీ పెరగవు. ఎందుకంటే రుణం తీసుకునేటప్పుడు బ్యాంకులు మనకు రెండు ఆప్షన్లు ఇస్తాయి. ఒకటి.. ఫ్లోటింగ్, రెండోది.. ఫ్లెక్సిబుల్.
మొదటి ఫ్లోటర్‌లో రెపో రేటులో మార్పు లేకుండా, మీ రుణ వడ్డీ రేటు మొదటి నుండి చివరి వరకు అలాగే ఉంటుంది. రెండోది ఫ్లెక్సిబుల్ లో వడ్డీ రేటును తీసుకోవడం ద్వారా రెపో రేటులో మార్పు ఉంటే, మీ లోన్ వడ్డీ రేటు కూడా మారుతుంది. ఫ్లెక్సిబుల్ వడ్డీ రేటుతో రుణం తీసుకున్నట్లయితే మీ లోన్ ఇఎంఐ కూడా పెరుగుతుంది.
ఉదాహారణకు...
మీరు ఫ్లెక్సిబుల్ వడ్డీ రేటుతో 6.50 శాతం చొప్పున 20 ఏళ్లపాటు 10 లక్షల రుణం తీసుకున్నారని అనుకుందాం. దీని ప్రకారం, మీ ఇఎంఐ ప్రస్తుతం రూ. 7,456 ఉంది. అయితే ఇప్పుడు పెరిగిన 0.50 శాతంతో 7% వడ్డీ రేటు, అంటే ఇఎంఐ రూ. 7,753 అవుతుంది. అంటే రూ.300 పెరుగుతుంది. ఇది కాకుండా 6.50 శాతంతో ముందుగా మీరు మొత్తం రూ.17.89 లక్షలు చెల్లించాల్సి ఉంటే, ఇప్పుడది పెరుగుతుంది.
అదేవిధంగా ఏదైనా బ్యాంక్ కార్ లోన్ వడ్డీ రేటు ప్రస్తుతం సంవత్సరానికి 7.45 శాతంగా ఉందనుకుందాం. ఎస్బిఐ కార్ లోన్ వడ్డీ రేటు 7.45 శాతం నుంచి 8.35 శాతానికి పెరిగితే. మీరు 20 సంవత్సరాల కాలవ్యవధికి రూ.10 లక్షల కారు రుణాన్ని కలిగి ఉన్నారనుకుందాం, ఇప్పుడు మీ ఇఎంఐ రూ.8,025 నుండి రూ.8,584కి పెరుగుతుంది. అంటే రూ. 559 పెరిగింది.
బ్యాంక్ పర్సనల్ లోన్ ప్రస్తుతం 7.05 శాతం వడ్డీ రేటును కలిగి ఉన్నారనుకుందాం.. ఇది 7.95 శాతానికి పెరిగితే, మీ రూ.10 లక్షల వ్యక్తిగత రుణ ఇఎంఐ 10 సంవత్సరాల కాల వ్యవధితో రూ.11,637 నుండి రూ.12,106కి పెరుగుతుంది. ఒక్కో ఇఎంఐకి రూ.469 పెరుగుదల ఉంటుంది.
ఈ 4 మార్గాలతో ఇఎంఐతో మీకు భారం పెరగకుండా చేయవచ్చు..
ఆర్బిఐ రెపో రేటును 0.50 శాతం పెంచిన తర్వాత, ఇప్పుడు చాలా బ్యాంకులు గృహ రుణాల వడ్డీ రేటును పెంచాయి. దీని వల్ల ఇప్పుడు గృహ రుణం పెరిగి, ఇఎంఐలు ఎక్కువ చెల్లించవలసి వస్తుంది. వడ్డీ రేట్ల పెంపు కారణంగా మీ ఇంటి బడ్జెట్ పై ప్రభావం పడుతోందా..? ఈ చర్యలు చేపట్టండి..
హోమ్ లోన్ రీఫైనాన్స్..
మీరు గృహ రుణం రీ ఫైనాన్స్ చేసుకోవచ్చు. మీ తీసుకున్న లోన్ రేటు, ఇతర బ్యాంకుల రేటు మధ్య పెద్ద (0.25-0.50 శాతం) వ్యత్యాసం ఉందా? అయితే వెంటనే హోమ్ లోన్ రీఫైనాన్స్ అంటే బ్యాలెన్స్ బదిలీ ఎంపిక ఎంచుకోండి. మీరు తీసుకున్న రేటు 7.50 శాతం ఉంది, కానీ మార్కెట్‌లో 7 శాతానికే రుణం పొందుతున్నారని అనుకుందాం. అటువంటి పరిస్థితిలో బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ తో ప్రయోజనం పొందవచ్చు. మీ లోన్ లో మీకు 20 సంవత్సరాలు మిగిలి ఉంటే, ప్రతి రూ.1 లక్ష రుణానికి, మీరు రూ. 7,400 వరకు ఆదా చేస్తారు. కానీ సగానికి పైగా రుణ కాల వ్యవధి మిగిలి ఉంటేనే బ్యాలెన్స్ బదిలీని ఆలోచించండి. ప్రాసెసింగ్ ఫీజు, ఎంఒడి ఛార్జీలు వంటి బదిలీ ఛార్జీలు భరించాల్సి వస్తుంది.
ఇఎంఐని పెంచుకోండి..
మీ ఆదాయం కాలక్రమేణా పెరుగుతూ ఉన్నా, ఇఎంఐ(EMI) మాత్రం ముందు నిర్ణయించిన మొత్తమే ఉంటుంది. కానీ మీరు స్వచ్ఛందంగా ఇఎంఐని పెంచుకోవచ్చు. ఇఎంఐని పెంచుకోవడం ద్వారా అసలు మొత్తం తగ్గుతుంది. ఇది మీ రుణాన్ని త్వరగా చెల్లించేందుకు దోహదం చేస్తుంది. దీంతో రుణ కాలపరిమితి తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ పద్ధతి చిన్న ప్రీ-పేమెంట్ వంటిదని చెప్పొచ్చు. ఉదాహరణకు 7 శాతం వడ్డీతో 20 సంవత్సరాలకు రూ. 30 లక్షల రుణం కోసం ఇఎంఐ రూ. 23,000 అవుతుంది. రెండో సంవత్సరం నుంచి రూ.26,000కి పెంచితే 3 ఇఎంఐలు తగ్గుతాయి. వడ్డీ కూడా రూ.25.96 లక్షల నుంచి రూ.25.10 లక్షలకు తగ్గుతుంది.
ప్రి పేమెంట్ చేయండి
ఇక మూడో మార్గం ఏమిటంటే.. వడ్డీ రేటు పెరిగినప్పుడు మీరు ఇఎంఐ(EMI)ని పెంచకూడదనుకుంటే, మీరు కనీసం సంవత్సరానికి ఒకసారి ప్రీపే చేసి, లోన్ ప్రిన్సిపల్ ఎమౌంట్ ను తగ్గించుకోవచ్చు. చాలా బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు ఇఎంఐ మొత్తానికి కనీసం ముందుగా చెల్లించాలని కోరుకుంటాయి. ఉదాహరణకు మీరు 7 శాతం రేటుతో 20 సంవత్సరాలకు రూ. 30 లక్షల గృహ రుణం తీసుకుని, ప్రారంభంలోనే రూ. 50,000 ప్రీపేమెంట్ చేస్తే, అప్పుడు 7 ఇఎంఐలు తగ్గుతాయి. తద్వార వడ్డీ 25.96 లక్షల నుండి 24.48 లక్షలకు తగ్గుతుంది.
లోన్ కాలపరిమితిని పెంచండి
హోమ్ లోన్ ఇఎంఐ కారణంగా నెలవారీ ఖర్చులు ప్రభావితం అవుతాయి. ఈ పరిస్థితిలో అదనపు ఆదాయం లేదా పొదుపులు లేకుంటే రుణం మరింత భారం అవుతుంది, దీనికి మీరు లోన్ కాలపరిమితిని పెంచడం ద్వారా ఇఎంఐని తగ్గించవచ్చు. కానీ మీరు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.
రూ.10 లక్షల రుణంపై వడ్డీ, ఇఎంఐ
లోన్ మొత్తం | వ్యవధి | వడ్డీ(%) | ఇఎంఐ | మొత్తం వడ్డీ | చెల్లించాల్సిన మొత్తం |
రూ.10 లక్షలు | 20 సంవత్సరాల | 6.50 | రూ.7,456 | రూ.7.89 లక్షలు | రూ.17.89 లక్షలు |
రూ.10 లక్షలు | 20 సంవత్సరాల | 7.00 | రూ.7,753 | రూ.8.60 లక్షలు | రూ.18.60 లక్షలు |
రూ.20 లక్షల రుణంపై వడ్డీ, ఇఎంఐ
లోన్ మొత్తం | వ్యవధి | వడ్డీ(%) | ఇఎంఐ | మొత్తం వడ్డీ | చెల్లించాల్సిన మొత్తం |
రూ.20 లక్షలు | 20 సంవత్సరాల | 6.50 | రూ.14,911 | రూ.15.78 లక్షలు | రూ.35.78 లక్షలు |
రూ.20 లక్షలు | 20 సంవత్సరాల | 7.00 | రూ.15,506 | రూ.17.21 లక్షలు | రూ.37.21 లక్షలు |
రూ.30 లక్షల రుణంపై వడ్డీ, ఇఎంఐ
లోన్ మొత్తం | వ్యవధి | వడ్డీ(%) | ఇఎంఐ | మొత్తం వడ్డీ | చెల్లించాల్సిన మొత్తం |
రూ.30 లక్షలు | 20 సంవత్సరాల | 6.50 | రూ.22,367 | రూ.23.68 లక్షలు | రూ.53.68 లక్షలు |
రూ.30 లక్షలు | 20 సంవత్సరాల | 7.00 | రూ.23,259 | రూ.25.82 లక్షలు | రూ.55.82 లక్షలు |
గమనిక: పై గణాంకాలు ఎస్బిఐ హోమ్ లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్ ఆధారంగా ఉంటాయి.