గోల్డ్ హాల్‌మార్కింగ్ గురించి తప్పకుండా తెలుసుకోండి..
హాల్‌మార్కింగ్ అనేది క్యారెట్‌లో స్వచ్ఛతను, బంగారం నాణ్యతను సూచిస్తుంది. 22కె916 (22 క్యారెట్), 18కె750 (18 క్యారెట్), 14కె585 (14 క్యారెట్) వంటి రకాల బంగారం స్వచ్ఛతలు ఉంటాయి. స్వచ్ఛతను కాపాడుకోవడానికి బంగారు ఆభరణాలను ఎక్కువగా 22 క్యారెట్ల బంగారంతో తయారు చేస్తారు. అయితే ప్రభుత్వం గోల్డ్ హాల్‌మార్కింగ్ రెండో దశ జూన్ 1 నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు 256 పాత జిల్లాలు కాకుండా 32 కొత్త జిల్లాల్లోనూ హాల్‌మార్కింగ్ కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఈ 288 జిల్లాల్లోనూ బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేశారు. ఈ జిల్లాల్లో 14, 18, 20, 22, 23, 24 క్యారెట్ల నగలు మాత్రమే అమ్ముడవ్వాలి. వీటిని కూడా హాల్‌మార్కింగ్ చేసిన తర్వాతే విక్రయించేందుకు వీలుంటుంది. ఈ హాల్‌మార్కింగ్ అంటే ఏమిటి, దాని గురించి తెలుసుకుందాం..
హాల్‌మార్కింగ్ అంటే ఏమిటి?
హాల్‌మార్క్ అనేది ప్రభుత్వ పరంగా బంగారం స్వచ్ఛత, నాణ్యతకు హామీ అన్నమాట. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్).. ఇది భారతదేశంలో హాల్‌మార్క్ ఉన్న ఏకైక ఏజెన్సీ. హాల్‌మార్కింగ్‌లో ఒక ఉత్పత్తిని నిర్దిష్ట ప్రమాణాలపై ధృవీకరిస్తారు. వినియోగదారులకు అందించే బంగారాన్ని పరిశీలించే సంస్థనే ఈ బిఐఎస్.. బంగారం నాణెం, ఆభరణాలపై హాల్‌మార్క్‌తో పాటు బిఐఎస్ లోగో ఉండడం తప్పనిసరి. ఈ లోగో ఉన్న బంగారం బిఐఎస్ లైసెన్స్ పొందిన ల్యాబ్‌లో పరీక్షించబడిందని చూపిస్తుంది.
ఇది ఎలా ఉపయోగపడుతుంది?
సామాన్య ప్రజలకు నగల దుకాణంలో బంగారం ఎంత స్వచ్ఛతతో కూడినది అనేది తెలియదు. ఇది సామాన్యులకు ప్రయోజనకరం, ఎందుకంటే నగలు కొన్న తర్వాత బంగారం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో తెలియదు. ఈ పరిస్థితిలో మోసం చేసే అవకాశం ఉంది. నకిలీ ఆభరణాల నుండి వినియోగదారులను కాపాడేందుకు, ఆభరణాల వ్యాపారాన్ని పర్యవేక్షించడానికి హాల్‌మార్కింగ్ తప్పనిసరి అవసరం. హాల్‌మార్కింగ్ ప్రయోజనం ఏమిటంటే, మీరు ఈ హాల్ మార్కింగ్ గోల్డ్ విక్రయించినప్పుడు తరుగుదల ఖర్చు తీసివేయరు. దీని వల్ల బంగారానికి సరైన ధరను పొందుతారు. హాల్‌మార్కింగ్ అనేక దశల తర్వాత నిర్థారిస్తారు, అందువల్ల దాని ఖచ్చితత్వంలో లోపానికి అవకాశం ఉండదు. హాల్‌మార్కింగ్ తో నగల ధరలో స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. దీని ధర స్వల్పంగా పెరిగింది.
బంగారు వస్తువులపై హాల్‌మార్కింగ్ కోసం రూ.35 పన్ను, కానీ ఆభరణాల స్వచ్ఛతను తనిఖీ చేయడానికి కనీసం రూ. 200 పన్ను. బిఐఎస్ ల్యాబ్ ఆభరణాల స్వచ్ఛతను నిర్ధారించడానికి లేదా హాల్‌మార్క్ చేయడానికి 6-8 గంటలు పట్టవచ్చు.
ఇది ఎలా అర్థం చేసుకోవాలి
బంగారం స్వచ్ఛతను అర్థం చేసుకునేందుకు 1 క్యారెట్ బంగారం అంటే 1/24 బంగారం, మీ ఆభరణాలు 22 క్యారెట్‌లైతే 22ని 24తో భాగించి 100తో గుణించండి. (22/24)x100 = 91.66 అంటే మీ ఆభరణాలలో ఉపయోగించే బంగారం స్వచ్ఛత 91.66 శాతం అన్నమాట.
మరో విషయం తెలుసా.. బిఐఎస్ చట్టం కూడా ఉంది. ఈ చట్టం ప్రకారం, హాల్‌మార్కింగ్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి కనీసం రూ.లక్ష నుంచి ఆభరణాల విలువకు 5 రెట్ల వరకు జరిమానా, ఏడాదిపాటు జైలు శిక్ష విధించే నిబంధన ఉంది.