4 లక్షలతో 7 వేల కోట్లు.. నీళ్లతో కోట్ల వ్యాపారం..

Spread the love

నీళ్లతో వ్యాపారం చేయొచ్చని 50 ఏళ్ల క్రితం ఎవరైనా ఊహించి ఉంటారా.. కానీ ఓ వ్యక్తి ఇలా ఆలోచించి వాటర్ బాటిళ్లతో భారతదేశంలో కోట్లాది రూపాయల వ్యాపారాన్ని సృష్టించాడు. ఇప్పుడు మనం అవే బాటిల్ వాటర్ కొని రోజూ వాడుతున్నాం. పాలు, కూరగాయలు, ధాన్యాలు విక్రయించి డబ్బు సంపాదించడం సాధారణంగా చూస్తూనే ఉంటాం..  కానీ ఆ రోజుల్లోనే నీటిని అమ్మడం  ద్వారా డబ్బు సంపాదించవచ్చని, కోట్ల వ్యాపారం సృష్టించవచ్చని నమ్మాడు. అంతేకాదు ఈ వ్యాపారవేత్త నీటిని అమ్మడం ద్వారా అపారమైన సంపదను సంపాదించాడు. భారతదేశంలో బాటిల్ వాటర్ వ్యాపారానికి రమేష్ చౌహాన్ ఒక ఐకాన్ లాంచి వారని చెప్పక తప్పదు.

1969లో రమేష్ చౌహాన్ బిస్లరీ వ్యాపారం ప్రారంభించారు. అయితే అప్పట్లో దేశంలో నీరు కొని తాగే వారెవరు ఉంటారు, అని ప్రజలు నవ్వుకునేవారు. కానీ ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత బిస్లరీ సీసాలు ప్రతి గల్లీ, మూలలో, హోటళ్లు, క్యాంటీన్లు ఎక్కడ చూసినా దర్శనమిస్తాయి. బిస్లరీ మరియు దాని యజమాని రమేష్ చౌహాన్ విజయగాథ గురించి తెలుసుకుందామా…

ఇటాలియన్ బ్రాండ్ కొని..

బిస్లరీ అనేది ఇటాలియన్ కు చెందిన బ్రాండ్, అయితే దీనిని చౌహాన్ కుటుంబం కొనుగోలు చేసింది. ఆయన ఫ్యామిలీకి చెందిన పార్లే సంస్థ 1969లో రూ. 4 లక్షలకు బిస్లరీని కొని వ్యాపారం చేసింది. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేసినప్పుడు రమేష్ చౌహాన్ వయస్సు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే ఉంది. 25 ఏళ్ల తర్వాత బిస్లరీ కమాండ్ పూర్తిగా రమేష్ చౌహాన్ చేతుల్లోకి వెళ్లగా, ఆ తర్వాత బిస్లరీ బాటిల్ వాటర్ వ్యాపారం వేగంగా అభివృద్ధి సాధిస్తూ వచ్చింది. ఇప్పుడు మినరల్ వాటర్ వ్యాపారంలో బిస్లరీకి ఎంత పెద్ద పేరుందో మీకు తెలిసిందే.. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ రూ.7000 కోట్లకు పైనే ఉంటుంది.

విక్రయించాలని అనుకుని, కూతురికి మళ్లీ పగ్గాలు..

రమేష్ చౌహాన్ కుమార్తె జయంతి చౌహాన్‌కు వ్యాపారంపై ఆసక్తి లేకపోవడంతో ఆయన బిస్లరీ వ్యాపారాన్ని విక్రయించాలని భావించారు. అప్పట్లో టాటా గ్రూప్ తో చర్చలు జరిగినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే చివరి క్షణంలో జయంతి మనసు మార్చుకుని బిస్లరీ బాధ్యతలు చేపట్టింది. ఇప్పుడు బిస్లారీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు జయంతి చౌహాన్ సన్నాహాలు మొదలుపెట్టారు.

32 శాతం మార్కెట్ వాటా

భారతదేశంలో ప్యాకేజ్డ్ వాటర్ మార్కెట్ విలువ రూ. 20,000 కోట్లకు పైగానే ఉంటుంది. దీనిలో 60 శాతం అసంఘటితమైనదే ఉంది. అయితే బిస్లరీ వ్యవస్థీకృత మార్కెట్లో 32 శాతం వాటాను కలిగి ఉంది. తన 52 ఏళ్ల కెరీర్‌లో చౌహాన్ అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించి వ్యాపారాన్ని విస్తరించారు.


Spread the love

Leave a Comment

error: Content is protected !!