Children’s Aadhaar : దేశవ్యాప్తంగా చిన్న పిల్లల ఆధార్ కార్డులకు సంబంధించిన కీలక మార్పులను UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రకటించింది. ముఖ్యంగా 5 సంవత్సరాల వయస్సు పూర్తయిన తర్వాత పిల్లల ఫోటో, వేలిముద్రలు (ఫింగర్‌ప్రింట్లు) అప్డేట్ చేయడం తప్పనిసరి అని యుఐడిఎఐ స్పష్టం చేసింది. తప్పనిసరిగా అప్డేట్ చేయాల్సి ఉంది.. లేకపోతే ఆధార్ నంబర్ తాత్కాలికంగా నిలిపివేసే ప్రమాదం ఉంది.
దేశంలో ఆధార్ అప్డేట్ చేయని పిల్లల సంఖ్య ఎంత ఉందో తెలుసా.. అక్షరాల 4.6 కోట్ల మంది పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ ఇప్పటికీ కాలేదు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో మరింత అవసరం కనిపిస్తోంది. పిల్లల ఆధార్ కార్డులు చాలావరకు స్కూల్ అడ్మిషన్లు, స్కాలర్‌షిప్లు, ఆరోగ్య పథకాలు, బ్యాంక్ ఖాతాలు మొదలైన వాటికి తప్పనిసరి. అందువల్ల అప్డేట్ చేయకపోవడం వల్ల వారికి ఈ సేవలు లభించకపోవచ్చు.
5 ఏళ్ల వయస్సులో ఉచితంగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే 7 ఏళ్ల తర్వాత అప్డేట్ చేయాలంటే రూ.100 చార్జ్ విధిస్తారు. అయితే ప్రస్తుతం.. పేరు, చిరునామా, మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకునేందుకు ఉచితంగా చాన్స్ ఉంది. 2025 జూన్ 14 వరకు ఎలాంటి ఫీజు కట్టకుండా అప్డేట్ చేయవచ్చు. ఆ తర్వాత మాత్రం రూ.50 ఫీజు వర్తిస్తుంది.
ఈ అప్డేట్‌లు myAadhaar పోర్టల్ (https://myaadhaar.uidai.gov.in), ఆధార్ సేవా కేంద్రాలు, లేదా పోస్టాఫీసులలో చేయవచ్చు. UIDAI ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రత్యేక డ్రైవులు, స్కూళ్లలో శిబిరాలు నిర్వహిస్తోంది.
కొత్త నియమాలు
జూలై 2, 2025 నుండి “Aadhaar Enrolment and Update First Amendment Regulations 2025” అమల్లోకి వచ్చాయి. ఇందులో UIDAI కొన్ని కఠినమైన మార్గదర్శకాలు తీసుకొచ్చింది..
- ఒక వ్యక్తికి ఒకే ఆధార్ మాత్రమే ఉండాలి.
- డూప్లికేట్ ఆధార్‌లు, తప్పుడు డేటా ఉన్న ఆధార్‌లు రద్దు చేయబడతాయి.
- ఆధార్ అప్డేట్ ప్రక్రియను AI ఆధారంగా నిఘా చేయనుంది.
- సరైన బయోమెట్రిక్ లేదా డెమోగ్రాఫిక్ డేటా లేనట్లయితే, UIDAI ఆ ఆధార్ నంబర్‌ను డీఆక్టివేట్ చేసే అవకాశం ఉంది.
UIDAI చైర్మన్ భువనేష్ కుమార్ ప్రకారం, ఆధార్ అప్డేట్‌లు సమయానికి చేయకపోతే, వ్యక్తులు ప్రభుత్వ పథకాలకు అర్హులు కాకపోవడం మాత్రమే కాదు, బ్యాంకింగ్, రేషన్, స్కాలర్‌షిప్, డిజిటల్ వాలెట్ లాంటి సేవలు నిలిపివేయబడవచ్చు.
ఈ మార్పులు ప్రజల వ్యక్తిగత డేటా భద్రతను పెంచడమే కాకుండా, మోసపూరిత ఆధార్ వినియోగం ను అడ్డుకోవడానికి ఉపయోగపడతాయని అధికారులు అంటున్నారు.
మీ పిల్లల వయస్సు ఇప్పటికే 5 ఏళ్లు దాటినట్లయితే, వెంటనే వారి ఆధార్‌ను నవీకరించండి. ఇది వారి భవిష్యత్తుకు అత్యంత కీలకమైన అంశం. అప్డేట్ చేయకుండా ఆలస్యం చేస్తే, అవసరమైన సమయంలో సేవలు పొందలేరు. కనుక ఆలస్యం చేయకుండా, ఆధార్ నవీకరణకు ఇప్పుడే అడుగు పెట్టండి!