45 ఏళ్లకే ధనవంతులు లేదా కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా?

Spread the love

పక్కా ప్రణాళికతో వెళితే సాధ్యమే.. దీనికి ఆర్థిక క్రమశిక్షణ అవసరం..

త్వరగా ధనవంతుడు లేదా కోటీశ్వరు కావాలంటే నేను సొంతంగా, అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలు ఏమిటో మీతో పంచుకుంటాను. చిన్నప్పటి నుంచి పెరిగి పెద్ద అయిన తర్వాత మొత్తం అన్ని విషయాలు మనం ధనవంతులం కావడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా 10వ తరగతి, ఇంటర్, ఇంజినీరింగ్ లేదా డిగ్రీ వంటి పూర్తయిన తర్వాత ఏం చేయాలనే దానిపై యువతకు సరైన అవగాహన ఉండాలి. ఇంజినీరింగ్ లేదా డిగ్రీ పూర్తి అయిన తర్వాత జాబ్ లేదా వ్యాపార ప్రయత్నాలు మొదలు పెడతారు. చదువు పూర్తయి జాబ్ వచ్చే నాటికి వయసు 25 ఏళ్లు ఉన్నాయనుకుందాం. జాబ్ వచ్చిన తర్వాత ప్రతి నెలా క్రమం తప్పకుండా పొదుపు లేదా పెట్టుబడి చేయడం అలవాటు చేసుకుంటే 45 ఏళ్లు వచ్చే సరికి కోటీశ్వరుడు కావొచ్చు. కానీ క్రమశిక్షణతో పెట్టుబడి చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. మధ్యలో మీ మదుపు డబ్బును తీసుకోవడం వంటివి చేయకూడదు. ప్రతి ఒక్కరూ చిన్న వయస్సులోనే కోటీశ్వరులు కావాలనే కలలు కంటారు, కానీ కొంతమంది మాత్రమే దానిని నెరవేర్చకోగలరు. డబ్బు సంపాధనకు అనేక మార్గాలు ఉన్నాయి. కానీ కొన్ని నియమాలను కరెక్ట్ గా పాటిస్తే త్వరగా కోటీశ్వరులు కావొచ్చు. అవేంటో తెలుసుకుందాం.

1. సంపాదనకు ముందు అప్పులుంటే తీర్చేయండి

డబ్బు సంపాధించాలంటే ముందు మనం మనకు లేదా మన కుటుంబానికి ఏమైనా అప్పులు ఉన్నాయా.. చూసుకోవాలి. ఎందుకంటే డబ్బు సంపాధించాలంటే అప్పులనేవి ఉండకూడదు. ఇది తప్పనిసరిగా పాటించాల్సిన షరతు. మీరు జాబ్ వచ్చినా లేదా వ్యాపారం ప్రారంభించినా అప్పులు ఉంటే వెంటనే తీర్చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అప్పులను ఆలస్యం చేస్తే, అవి ఒక కొండలా, బండలా మారిపోతాయి. ఇళ్లు, విద్య, ఇతర అవసరాల కోసం రుణాలు తీసుకున్నట్లయితే లేదా మీ తల్లిదండ్రులు ఏమైనా అప్పులు చేస్తే ముందు వాటిని సెటిల్ చేయండి. మీరు పెద్ద అప్పు అయినా తీర్చే సమయంలో కొంత భారంగానే ఉంటుంది. కానీ ఆ అప్పును తీర్చిన తర్వాత పొదుపు లేదా పెట్టుబడి చేస్తే మీరు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

2. పొదుపు కంటే పెట్టుబడే ఉత్తమం

ఇది ఎందుకు అన్నానంటే, పొదుపు చేస్తే బ్యాంకు ఎఫ్డీ, సేవింగ్ ఖాతాల్లో వచ్చే వడ్డీ తక్కువగా ఉంటుంది. అదే పెట్టుబడి చేస్తే మీరు పెద్ద మొత్తంలో రాబడిని పొందుతారు. అయితే సరైన పెట్టుబడి సాధనాలను ఎంపిక చేసుకోవాలి. ఎక్కువ మంది ఇన్వెస్ట్ మెంట్ ను వాయిదా వేస్తూ ఉంటారు. జీతం అరకొరగా ఉందని, కొద్ది డబ్బుతో ఏం పెట్టుబడి పెడతాంలే అని అనుకుంటారు. ఎంత చిన్న మొత్తం అని కాదు, ఆ చిన్న మొత్తాన్ని ఆపకుండా కొన్నేళ్ల పాటు కొనసాగిస్తున్నామా, లేదా, అనేది అత్యంత ముఖ్యమైన విషయం. మ్యూచువల్ ఫండ్స్ లో రూ.100 నుంచి పెట్టుబడి ప్రారంభించే అవకాశం ఉంది.

3. అత్యవసర నిధి తప్పనిసరి

అత్యవసర పరిస్థితి అవసరాల కోసం కొంత డబ్బు మన దగ్గర ఎప్పుడూ ఉండాలి. భవిష్యత్ లేదా రిటైర్మెంట్ కోసమే కాదు, ఉద్యోగం కోల్పోవడం వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఏం చేయాలనేది దానికి ముందస్తుగా సిద్ధంగా ఉండాలి. దీనికి కనీసం 5 నుంచి 6 నెలల జీతంతో సమానంగా మన దగ్గర డబ్బు ఉండాలి. కరోనా విపత్కర పరిస్థితులు అందరికీ ఈ ఫాఠాన్ని నేర్పించాయి.

4. ఆరోగ్య బీమా ముఖ్యం

కరోనా మహమ్మారి మనకు నేర్పించిన ఇంకో పాఠం ఏమిటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలని. నేడు ఆసుపత్రి ఖర్చులు భరించాలంటే మనం ఆదాయం సరిపోని పరిస్థితులు ఉన్నాయి. లక్షల లక్షల ఫీజులు చెల్లించి వైద్య చికిత్స పొందే బాధల నుంచి విముక్తి పొందాలంటే ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉండాలి. ఇది ఉంటే మన సంపాధనకు ఒక భరోసా కూడా ఉంటుంది. అనారోగ్యం తలెత్తినప్పుడు భారీ ఖర్చులు కాకుండా మన పొదుపు, పెట్టుబడులకు ఎలాంటి అవరోధాలు కల్గకుండా హెల్త్ ఇన్సూరెన్స్ లు రక్షిస్తాయి. దీని కోసం టర్మ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు, తక్కువ ప్రీమియంతో కూడిన ప్లాన్ లను ఎంపిక చేసుకోవాలి.

5. ఖర్చులను తగ్గించుకోండి

మనం త్వరగా డబ్బును పెంచుకోవాలంటే ఈ సూత్రం తప్పనిసరిగా పాటించాలి. వీలైనంత వరకు ఖర్చులను తగ్గించుకుని డబ్బును ఆదా చేసేందుకు ప్రయత్నించాలి. అనవసరమైన వాటి కోసం ఖర్చులు చేయొద్దు. ముఖ్యమైనది అయితేనే డబ్బు ఖర్చు చేయాలి. ఎందుకంటే ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యం. మన నెలవారీ ఖర్చులకు ఒక బడ్జెట్ ను సిద్ధం చేసుకోవాలి. వాటిలో అసలు ఖర్చులు, వాటి అవసరం, ఎంత మేరకు ఖర్చు చేయాలనే నెలాఖరున ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది.

6. నిత్య విద్యార్థిలా ఉండాలి..

ఇది ఎందుకు అన్నానంటే, ఎంత ఎక్కువ సమాచారం లేదా విషయ పరిజ్ఞానం ఉంటే, అంత ఎక్కువ ప్రయోజనం పొందుతాం. ఇది మనిషి జీవితానికే కాదు, డబ్బు సంపాదనకు కూడా ముఖ్యమైంది. ఎప్పుడూ మనం అప్‌డేట్‌గా ఉండాలి. ఉద్యోగమైనా, వ్యాపారమైన ఎప్పుడూ కొత్త సమాచారం తెలుసుకుంటూ ఉండాలి. పెట్టుబడులకు ఏ స్కీమ్ బాగుంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు పెంచుకునే చాన్స్ ఉంది. కొత్తకొత్త మార్గాలు ఏమొస్తున్నాయి, ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? భవిష్యత్ లో వేటికి డిమాండ్ ఉంటుంది? దానికి అనుగుణంగా ఇప్పుడే మనం ఏం చేస్తే బాగుంటుంది? వంటి విషయాలను తెలుసుకోవాలి. ఇంకా ఎక్కడ రిస్క్ ఎక్కువగా ఉంటుంది? ఎక్కడ పెట్టుబడి పెట్టొద్దు? వంటివి తెలుసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ఫిక్స్ డ్ డిపాజిట్లు వంటి వాటి గురించి పూర్తిగా తెలుసుకున్నాకే ముందుకు వెళ్లండి.

 

కోటీశ్వరుడు కావాలంటే..

కోటీశ్వకుడు కావాలనే కలను నెరవేర్చుకునేందుకు మాత్రం ఒక్క పక్కా ప్రణాళికతో ముందుకు సాగండి. ఏ పని పూర్తి చేయాలన్నా సరైన ప్లానింగ్ చాలా అవసరం, క్రమశిక్షణతో పెట్టుబడి చేస్తే తప్పకుండా కోటీశ్వరులు అవుతారు. ప్రతి నెల ఒక రూ.1000 పొదుపు చేయడం ద్వారా రిటైర్మెంట్ వయసు నాటికి అనుకున్న కలను నెరవేర్చుకోవచ్చు.

పైన చెప్పినట్టు 20 ఏళ్ల వయసు వారు, నెలకు రూ.1000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ కోటీశ్వరులు కావాలంటే..

ఉదాహరణకు 40 ఏళ్లు × నెలకు రూ.1000 చొప్పున (12% రాబడితో) = రూ.1.14 కోట్లు పొందే అవకాశం ఉంది.

20 ఏళ్ల వయసులో..

చదువు కుంటూ లేదా జాబ్ చేస్తూ చాలా త్వరగా అంటే 20 ఏళ్ల వయసులో పొదుపును ప్రారంభిస్తే కోటీశ్వరుడు కావాలనే కల సులభంగా నెరవేరుతుంది. అలా 45 సంవత్సరాల వరకు ప్రతి నెలా రూ.6000 తప్పనిసరిగా ఆపకుండా పొదుపు చేయాలి. ప్రతి నెలా సిప్ (సిస్టమెటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్) ద్వారా పెట్టుబడి పెడితే 25 సంవత్సరాల్లో కోటీశ్వరుడి కల సాకారం అవుతుంది. నెలకు రూ.6000 చొప్పున మీరు సంవత్సరానికి రూ.72000 ఇన్వెస్ట్ చేస్తారన్న మాట. దీనికి తక్కువలో తక్కువ 12 శాతం వార్షిక రాబడిని పొందితే, మీరు 45 ఏళ్ల నాటికి కోటీశ్వరుడు అవుతారు.

పైన చెప్పినట్టు 20 ఏళ్ల వయసు వారు అయితే.. 45 ఏళ్లకే కోటీశ్వరులు కావాలంటే..

ఉదాహరణకు 25 ఏళ్లు × నెలకు రూ.6000 చొప్పున (12% రాబడితో) = రూ.1.14 కోట్లు పొందే అవకాశం ఉంది.

30 ఏళ్ల వయసులో..

ఇక కీలకమైన వయసు 30 ఏళ్ల నుంచి పెట్టుబడి ప్రారంభిస్తే ప్రతి నెలా సిప్ ఎమౌంట్ పెంచాల్సి ఉంటుంది. నెలకు రూ.20,000 చొప్పున సిప్ చేయాలి. దీంతో మీరు తక్కువలో తక్కువ 12 శాతం వార్షిక రాబడిని పొందితే, 45 ఏళ్ల వయసు నాటి కోటీశ్వరుడు అవుతారు. మీరు మ్యూచువల్ ఫండ్ సరైనది ఎంచుకుంటే ఈ రాబడి 20 శాతం వరకు రిటర్న్ రావొచ్చు. దీంతో ఇంకా త్వరగా కోటీశ్వరులు అవుతారు.

పైన చెప్పినట్టు 30 ఏళ్ల వయసు వారు అయితే.. 45 ఏళ్లకే కోటీశ్వరులు కావాలంటే..

ఉదాహరణకు 15 ఏళ్లు × నెలకు రూ.20,000 చొప్పున (12% రాబడితో) = రూ.1.01 కోట్లు పొందే అవకాశం ఉంది.

 

వీటిని కూడా తెలుసుకోండి..

  • మనం ఎప్పుడైతే ఉద్యోగం లేదా వ్యాపారం ప్రారంభిస్తామో అప్పటి నుంచే, అంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెట్టుబడిని మొదలు పెట్టేయండి. ఖర్చులు పోను మిగిలిన డబ్బులను సరైన పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్టే చేయాలి. ఇది మీ బంగారు భవిష్యత్ కు బాట వేస్తుంది. దీనికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), మ్యూచువల్ ఫండ్ లేదా రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) వంటి సురక్షితమైన వాటిలో పెట్టుబడి పెట్టండి. దీంతో దీర్ఘకాలంలో మంచి రాబడి రావడం ఖాయం. అంతేకాదు ఇవి అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనాలు కూడా.
  •  
  • తక్కువ రాబడి పెట్టుబడులను ఒకసారి పునఃపరిశీలించుకోండి. వాటిలో సరైన రాబడి రాకపోతే ఆ డబ్బును వెనక్కితెచ్చిన మరొక మంచి స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. అయితే అధిక రాబడిని ఇస్తున్న పెట్టుబడి సాధానాల జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లొద్దు.
  •  
  • చిన్న వయస్సులోనే అంటే 20-25 ఏళ్ల నుంచే పెట్టుబడి ప్రారంభిస్తే గనుక ఈక్విటీ లింక్డ్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టొచ్చు. ఇవి రిస్క్ తో కూడినవి అయినప్పటికీ దీర్ఘకాలంలో అత్యధిక రాబడిని ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం ఉండదని నిపుణులు చెబుతారు. దీనికోసం ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకొని పెట్టుబడి ప్రారంభిస్తే ఇంకా మంచిది.
  •  
  • ఎంత ఇన్వెస్ట్ చేయాలనే విషయాలను చూస్తే, సాధారణంగా 25 ఏళ్ల వ్యక్తి 60 ఏళ్ల వయస్సులో రిటైర్మెంట్ తీసుకుంటారు. వీరు రిటైర్మెంట్ నాటికి రూ. 1 కోటి సంపాదించాలంటే మాత్రం పెట్టుబడిపై 12% వార్షిక రాబడిని అంచనా వేస్తే, నెలకు రూ.2 వేలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అదే 45 ఏళ్ల వ్యక్తి అయితే నెలకు రూ.20 వేలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే ఎంత తొందరగా పెట్టుబడి ప్రారంభిస్తే అంత మంచిది అన్నమాట.

Spread the love

2 thoughts on “45 ఏళ్లకే ధనవంతులు లేదా కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా?”

Leave a Comment

error: Content is protected !!