దాని వల్ల మన డబ్బు విలువ ఎలా తగ్గుతుంది..?
ఈ సమయంలో ఎలాంటి సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ చేయాలి
ద్రవ్యోల్బణం అంటే సింపుల్ గా చెప్పాలంటే.. ధరల పెరుగుదల అన్నమాట. అంటే మనం సంపాదించిన డబ్బు విలువ తగ్గిపోతుందన్న మాట. కోనుగోలు శక్తికి తగినట్టుగా ఉత్పత్తి లేకపోతే ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా వంటనూనెలు, బియ్యం, చక్కెర, మైదా, టీ ఆకులు వంటి ఆహార పదార్థాలు ఖరీదైనవిగా మారాయి. పాలతో పాటు నిత్యావసర సబ్బులు, షాంపూ, డిటర్జెంట్ ధరలు కూడా పెరిగాయి. దీని వల్ల ప్రజల ఇంటి బడ్జెట్ దారుణంగా మారింది.
సామాన్యుడిపై పెను భారం
ద్రవ్యోల్బణం ప్రభావం వల్లే పాఠశాల ఫీజులు, విమాన ప్రయాణం, క్యాబ్ రైడ్‌లు, రెస్టారెంట్లలో తినడం కూడా ఖరీదైనవిగా మారాయి. ఎందుకంటే ద్రవ్యోల్బణంతో రెస్టారెంట్లు ఇబ్బంది పడుతున్నాయి, అవి వినియోగదారులపై భారాన్ని మోపాయి. ఇప్పుడు బ్యాంకు నుండి రుణం తీసుకునే వారి ఇఎంఐ కూడా పెరగ్గా, భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశముంది. ఇటీవల ఈ ద్రవ్యోల్బణం పెరగడం వల్లే ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) రెపో రేటు (వడ్డీ రేటు)ను 40 బేసిస్ పాయింట్లు (0.40 శాతం) పెంచింది. ద్రవ్యోల్బణం కారణంగా ఆదాయం పెరగకపోగా ఖర్చులు పెరుగుతుండడం సామాన్యులకు సమస్యగా మారింది. ఈ పరిస్థితిని నుంచి బయటపడడం ఎలా.. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ద్రవ్యోల్బణం నుండి ఎలా కాపాడుకోవాలంటే ఏం చేయాలి.
ద్రవ్యోల్బణం కాలంలో మీరేం చేయాలి..
ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు మీ పెట్టుబడి, పొదుపు పద్ధతిని సమీక్షించడం చాలా ముఖ్యం. బ్యాంకులు రుణాలు ఖరీదైనవిగా మారతాయి. అంటే ఇల్లు, కారు లేదా ఇతర వినియోగ వస్తువులను కొనుగోలు చేయడం ఖరీదైనది అవుతుంది. ఈ పరిస్థితిలో రుణం తీసుకోవాలనుకునే వారు, ఆలోచనను సమీక్షించాల్సిన అవసరం ఉంది. వడ్డీ రేట్లు ఖరీదైనప్పుడు డిపాజిట్లు, ఎఫ్‌డిలు, బ్యాంకు ఖాతాలో ఉంచిన డబ్బుపై వడ్డీ ఉపశమనం కలిగిస్తుంది. కానీ ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పుడు లోన్ల ఇఎంఐలు భారంగా మారతాయి. అలాంటి పరిస్థితిలో ఖర్చులను తగ్గించడం చాలా ముఖ్యం.
ఎలా పొదుపు చేయాలి..
ద్రవ్యోల్బణంతో అప్పుల ఖర్చు పెరుగుతుంది. మరోవైపు బ్యాంకు పొదుపుపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఈ పరిస్థితిలో మీరు డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని పొందే మార్గాలను చూడాలి. ఇంట్లో ఉంచిన నగదును బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయవచ్చు. దానిపై మీరు 3-4 శాతం వరకు వడ్డీ పొందుతారు. ఈ వడ్డీని పొందడం ద్వారా ఖరీదైన ఇఎంఐ భారాన్ని కొంతం తగ్గించుకోవచ్చు.