బహుళ బ్యాంక్ ఖాతాల వల్ల లాభాలు, నష్టాలు ఏమిటి?
ఇప్పుడు చేతిలో మొబైల్ మాదిరిగానే ప్రతి వ్యక్తికి బ్యాంకు ఖాతా సర్వసాధారణం అయ్యాయి. ప్రధాన మంత్రి జన్ ధన్ ఖాతా ద్వారా దేశంలోని ప్రతి పౌరునికి బ్యాంకింగ్ సౌకర్యాల ప్రయోజనాలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రోజుల్లో సేవింగ్స్ ఖాతా లేకుండా మీ పనిని నిర్వహించలేం, దేశంలోని చాలా మంది ప్రజలు తమ పొదుపు ఖాతాను ఏదో ఒక బ్యాంకులో ఓపెన్ చేస్తున్నారు. కానీ చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ పొదుపు ఖాతాలు ఉన్నాయి. ఉద్యోగులకు వారి సంస్థలో సాలరీ సేవింగ్ అకౌంట్ ను ఇస్తుంది. ఉద్యోగం మారిన తర్వాత వారు ఆ ఖాతాను మూసివేయడం మర్చిపోతారు. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉండటం వల్ల ప్రయోజనాలు, అప్రయోజనాలు రెండూ ఉన్నాయి. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉండటం వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి తెలుసుకుందాం..
నష్టాలేమిటి..
సిబిల్ (CIBIL) స్కోర్‌పై ప్రభావం
మీరు మీ బ్యాంక్ ఖాతాను ఎక్కువ కాలం ఉపయోగించకపోతే అది నిష్క్రియంగా మారుతుంది. దీంతో పాటు కనీస బ్యాలెన్స్ నిర్వహించనందుకు ఖాతాలపై జరిమానా పడుతుంది. దీంతో ఈ జరిమానా కారణంగా కస్టమర్ సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది.
జరిమానా చెల్లించాల్సి వస్తుంది..
ఒకటి కంటే ఎక్కువ సేవింగ్స్ ఖాతాలపై డెబిట్ కార్డ్, ఎస్ఎంఎస్ సౌకర్యాన్ని పొందుతూ ఉంటాం. ఈ సదుపాయానికి బదులుగా బ్యాంకు ఖాతాదారుల నుండి వివిధ రకాల సేవా చార్జీలను వసూలు చేస్తుంది. అయితే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉంటే మీరు సర్వీస్ ఛార్జీని చెల్లించాలి. దీని కారణంగా ఎక్కువ డబ్బు చెల్లించవలసి ఉంటుంది.
ఐటి రిటర్న్స్ లో ఇబ్బందులు ఉంటాయ్
ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు అన్ని బ్యాంకు ఖాతాల సమాచారాన్ని, వాటిలో డిపాజిట్ చేసిన మొత్తాన్ని నమోదు చేయాలి. ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉండడం వల్ల ఆ వివరాలను తీసుకోవడలో సమస్యలు తలెత్తుతాయి. మీ రిటర్న్‌ను ఫైల్ చేస్తున్నప్పుడు మీరు బ్యాంక్ ఖాతా వివరాలను కోల్పోయినట్లయితే, మీరు మరింత వడ్డీని చెల్లించాల్సి వస్తుంది.
మోసాలకు అవకాశం
ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే మోసాలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్ని బ్యాంకు ఖాతాల గురించి సరైన సమాచారాన్ని ఎప్పుడు భద్రపర్చుకోవడం కష్టం. మోసగాళ్ళు మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ సమాచారాన్ని దొంగిలించి, మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేయవచ్చు. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉండటం వలన సులభంగా మోసానికి గురవుతారు.
లాభాలేమిటి..
అవసరానికి అనుగుణంగా పెట్టుబడి పెట్టండి
ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉండటం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, వివాహం మొదలైన వాటి కోసం మీ అవసరం ఆధారంగా వివిధ పెట్టుబడులు పెట్టవచ్చు. మీరు వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా పెట్టుబడి పెట్టడం ద్వారా మీ భవిష్యత్తు లక్ష్యాలను సులభంగా సాధించవచ్చు.
లిక్విడిటీకి కొరత లేదు
ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉండటం వల్ల మీకు లిక్విడిటీ కొరత సమస్య ఉండదు. అవసరానికి అనుగుణంగా వేర్వేరు బ్యాంకులకు చెందిన ఎటిఎం(ATM) ద్వారా డబ్బు తీసుకునే వెసులుబాటు ఉంటుంది.