బంగారం దొంగిలిస్తారనే భయం ఉండదు.. పెట్టుబడి సురక్షితం

Spread the love

సావరిన్ గోల్డ్ బాండ్(ఎస్ జి బి)తో ఇది సాధ్యం, డిజిటల్ రూపంలో ఉండే 24 క్యారెట్ల గోల్డ్

వార్షికంగా 2.5 శాతం వడ్డీ కూడా పొందవచ్చు..

బంగారం సురక్షితమైన పెట్టుబడి, మంచి రాబడిని ఇస్తుంది. భవిష్యత్ అవసరాలు, పిల్లల కోసం దీనిని తీసుకునేవారు ఉంటారు. కానీ పెట్టుబడికి రాబడి నిలకడగా వచ్చినప్పటికీ, భౌతికంగా బంగారం భద్రపర్చుకోవడం ఈ రోజుల్లో కష్టమైనదే. సురక్షితంగా ఉండేందుకు బ్యాంక్ లాకర్లను ఎంపిక చేసుకోవచ్చు. కానీ అవి అందరికీ అందుబాటులో ఉండవు. అలాంటి వారి కోసం ప్రభుత్వం ఈ సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జిబి)ని తీసుకొచ్చింది. ఇది డిజిటల్ రూపంలో ఉండే 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం కూడా. భారత ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఈ బాండ్ లను దశల వారీగా ప్రజలకు అందిస్తోంది. గోల్డ్ మానిటైజేషన్ పథకం (జిఎంఎస్) కింద 2015 నవంబర్ లో ఇది అమలులోకి వచ్చింది. ఈ డిజిటల్ బాండ్లతో దీర్ఘకాలికంగా వచ్చే విలువతో పాటు ఏడాదికి 2.5 శాతం మేరకు వడ్డీ రేటును కూడా పొందవచ్చు. బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇది మంచి స్కీమ్. దీనికి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

పెట్టుబడి సురక్షితంగా ఉండాలంటే ఎల్లప్పుడూ బంగారాన్నే ఎంచుకుంటారు. భౌతికంగా ఆందోళనలు ఉంటాయి. కానీ ఈ స్కీమ్ ద్వారా గోల్డ్ డిజిటల్ రూపంలో ఉండడం వల్ల దొంగిలిస్తారేమోననే భయం కానీ, పోగొట్టుకుంటామేమో అనే భయం కానీ ఉండదు. నిర్ణీత కాలవ్యవధిలో స్థిరమైన వడ్డీ లభిస్తుంది. అథరైజ్ డ్ బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్, స్టాక్ ఎక్సేంజ్ ల నుంచి ఎవరైనా సరే ఎస్ బిజి ని కొనవచ్చు. ఇదొక్కటే యూనిట్లలో లభిస్తుంది. ఒక యూనిట్ ఒక గ్రామ్ లేదా ఒక సింగిల్ బాండ్ కు సమానం. ఉదాహరణకు, మీరు 10 గ్రాముల బంగారం కొనదలుచుకుంటే, 10 యూనిట్ల గోల్డ్ బాండ్స్ కొంటే సరిపోతుంది. ఈ బాండ్లను ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో కొనవచ్చు. ప్రస్తుతం ఆన్ లైన్ లో కొంటే ప్రతి యూనిట్ పైనా రూ. 50 డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ప్రస్తుత వడ్డీ రేట్ ప్రకారం, మొదటి పెట్టుబడిపై ఏడాదికి 2.5 శాతం వడ్డీ వస్తుంది. ఆరు నెలలకొకసారి వడ్డీని బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. అయితే వడ్డీపై వచ్చే ఆదాయానికి పన్ను ఉంటుంది. కొనేవారు తమ డిమాట్ ఖాతా వివరాల్ని వెల్లడిస్తే బాండ్ ను డిమాట్ ఫాంలో నిల్వ చేస్తారు. లేకుంటే ఆర్ బిఐ బుక్ లో స్టోర్ చేస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్ కాలపరిమితి పూర్తయిన తర్వాత మార్కెట్ లో అప్పటి బంగారం విలువ ప్రకారం ఇన్వెస్టర్ కు డబ్బు ఇస్తారు.

ఎస్ బిజి ప్రత్యేకతలు (ఎస్ బిజి ఫీచర్స్)

సావరిన్ గోల్డ్ బాండ్స్ ను యూనిట్లలో లెక్కిస్తారు. ఒక యూనిట్ అంటే ఒక గ్రాము బంగారం. 4000 యూనిట్లంటే 4 కిలోల బంగారం. ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టాలనుకునేవారు కనీసం ఒక యూనిట్ ను కొనాలి. ఆన్ లైన్ లో కొనేవారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్ ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒకవేళ 10 గ్రాముల బంగారం కొంటే 500 రూపాయల డిస్కౌంట్ ఉంటుంది. ఎస్ జిబిలో ఒక వ్యక్తి కనీస పెట్టుబడి ఒక ఆర్థిక సంవత్సరంలో 4000 యూనిట్లు ఉండాలి. ట్రస్ట్ లు, గుర్తింపు పొందిన సంస్థలు గరిష్ఠంగా 20,000 యూనిట్లు కొనవచ్చు.

బాండ్ కాలపరిమితి

సావరిన్ గోల్డ్ బాండ్ కాలపరిమితి 8 సంవత్సరాలు. 5 ఏళ్లకు లాక్ ఇన్ ఉంటుంది. అంటే మీరు వడ్డీ చెల్లించిన తేదీతో ప్రారంభించి అయిదేళ్ల తర్వాత మీకు ఇష్టం లేకుంటే ఎగ్జిట్ కావచ్చు. ఇన్వెస్టర్ ఒకవేళ బాండ్ ను డిమాట్ లోకి మార్చుకుంటే అయిదేళ్ల తర్వాత బాండ్ యూనిట్లను ఆర్ బిఐ ద్వారా అమ్మవచ్చు.

సమాంతరంగా అప్పు

అప్పుకోసం దరఖాస్తు సమయంలో ఆ వ్యక్తి డిమెటీరియలైజ్ డ్ సావరిన్ గోల్డ్ బాండ్ ను కొలాటరల్ గా చూపించవచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్ చూపిస్తే అథీకృత బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్ బిఎఫ్ సి) రుణాలిచ్చేందుకు ముందుకొస్తున్నాయి. అయితే అప్పు ఇవ్వడంలో తుది నిర్ణయం ఆయా సంస్థలదే. అప్పు విలువ నిష్పత్తి (లోన్ టు వాల్యూ – ఎల్ టివీ) కూడా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బిఐ) సాధారణ గోల్డ్ లోన్ కు నిర్ణయించిన ప్రకారమే ఉంటుంది. అప్పుడప్పుడూ రుణ నిష్పత్తిని సవరిస్తారు.

టాక్స్ ప్రయోజనాలు

ఆదాయపు పన్ను చట్టం 1961 (43వ నిబంధన) కింద సావరిన్ గోల్డ్ బాండ్ పై వచ్చే వడ్డీకి పన్ను ఉంటుంది. ఎస్ జిబి నుంచి ఎవరైనా బయట పడాలంటే పెరిగిన మూలధన రాబడిని (కేపిటల్ గెయిన్) మాఫీ చేస్తారు. అలాగే ఎస్ జిబి కొనుగోలుపై జిఎస్ టి ని కూడా మినహాయిస్తారు. ఒకవేళ బాండ్ ను బదిలీ చేస్తే దీర్ఘ కాలిక మూలధన రాబడికి ఆ వ్యక్తికి విడిగా లాభాలుంటాయి.

బాండ్ సర్టిఫికేట్

ఎస్జిబి బాండ్ ను కొన్నప్పుడు ఇన్వెస్టర్ కు కొనుగోలుకు గుర్తుగా కొన్ని రోజుల తర్వాత అకనాలెడ్జ్ మెంట్ రసీదు ఇస్తారు. బాండ్ విడత బ్రోచర్ లో సర్టిఫికేట్ ఇచ్చిన తేదీ ఉంటుంది. దాన్ని ఇన్వెస్టర్ కొన్న చోటు నుంచి, అంటే అథరైజ్డ్ బ్యాంకులు, పోస్టాఫీస్, ఎస్ హెచ్ సిఐఎల్ ఆఫీస్ లేదా ఏజెంట్ ద్వారా పొందవచ్చు. ఒకవేళ ఎవరైనా ఆన్ లైన్ ద్వారా బాండ్ ను కొంటే ఆ వ్యక్తి అతను లేదా ఆమె ఇ మెయిల్ అడ్రస్ కు సర్టిఫికేట్ సాఫ్ట్ కాపీ వస్తుంది. ఆ సర్టిఫికేట్ మీద కస్టమర్ పేరు, గోల్డ్ యూనిట్ వివరాలు ఉంటాయి.

ఆఫ్ లైన్ పేమెంట్

ఎస్ జిబిను డైరెక్ట్ గా ఆఫ్ లైన్ లో కొనాలనుకుంటే ఇలా పేమెంట్ చేయవచ్చు. రూ. 20,000 వరకు నగదు రూపంలో పే చేయవచ్చు. చెక్, డిమాండ్ డ్రాఫ్ట్, ఎలక్ట్రానిక్ ఫండ్ బదిలీ అమలు చేస్తారు.

నామినేషన్ సదుపాయం

బాండ్ కొనేటప్పుడు ఇన్వెస్టర్ నామినీ గురించి సమాచారం ఇవ్వవచ్చు. వేరు వేరు యూనిట్ కేటాయింపుల్లో ఇద్దరు నామినీలను చేర్చేందుకు ఎస్ జిబి అనుమతిచ్చింది. ఎవరిని నామినీలుగా ఎంచుకోవాలనేది కస్టమర్ల ఇష్టం. ఒకవేళ బాండ్ హోల్డర్ అనుకోకుండా మరణిస్తే, అప్పటి తాజా ధర ప్రకారం గోల్డ్ యూనిట్లను నామినీలకు ఇస్తారు.

బాండ్ ను ఎలా వెనక్కు తీసుకోవచ్చు?

సావరిన్ గోల్డ్ బాండ్ టైమ్ లిమిట్ 8 ఏళ్లు అయినా, అది జారీ చేసిన తేదీ నుంచి 5 ఏళ్ల తర్వాత దాన్ని వాపస్ తీసుకోవచ్చు. అలా తిరిగి తీసుకోవాలంటే కూపన్ పేమెంట్ డేట్ కు 30 రోజుల ముందు ఇన్వెస్టర్ బ్యాండ్ లేదా ఏజెంట్ లేదా ఎస్ హెచ్ సిఐఎల్(స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) లేదా పోస్టాఫీస్ నుంచి సంప్రదించవచ్చు. అలాగే బాండ్ మెచూర్ కాకముందు వాపస్ తీసుకునేందుకు అనుమతిస్తారు. అయితే కూపన్ పేమెంట్ డేట్ కు ఒక రోజు ముందు ఇన్వెస్టర్ బ్యాంక్ ను లేదా ఆర్థిక సంస్థను సంప్రదించాల్సి ఉంటుంది.

వాపస్ తీసుకునేటప్పుడు కస్టమర్ ఎర్నింగ్స్ ను ఆ వ్యక్తికి చెందిన బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ చేస్తారు. ఒకవేళ అకౌంట్ డిమాట్ రూపంలో ఉంటే హోల్డర్ బంగారాన్ని ఏ టైమ్ లో అయినా స్టాక్ ఎక్సేంజ్ లో ట్రేడ్ చేయవచ్చు.

ఎస్ జిబి కొనడానికి అర్హతలు

 1. భారతదేశంలో నివసించే వారందరూ గోల్డ్ బాండ్స్ కొనేందుకు అర్హులే.
 2. ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ (ఫెమా) 1999 నిర్వచనం ప్రకారం దేశంలో నివసించేవారు అర్హులు.
 3. ఎస్ జిబి కొనడానికి వయోపరిమితి లేదు.జాయింట్ గా కూడా కొనవచ్చు. మైనర్ తరఫున లీగల్ గార్డియన్ కొనవచ్చు.
 4. హిందూ అవిభక్త కుటుంబ సభ్యులు కూడా బాండ్ కొనేందుకు అర్హులు.
 5. యూనివర్శిటీలు. ట్రస్ట్ లు. ఛారిటబుల్ ఇన్ స్టిట్యూషన్స్ కూడా కొనవచ్చు.

కెవైసి డాక్యుమెంట్స్

 • ఎస్ జిబి లను కొనే ప్రక్రియ చాలా సులువు. ఎస్ జిబిలను ఆన్ లైన్, ఆఫ్ లైన్ లలో కూడా కొనవచ్చు. ఆఫ్ లైన్ లో కొనదలుచుకున్నవారు అథరైజ్ డ్ బ్యాంకులకు లేదా పోస్టాఫీస్ లకు వెళ్లాలి.
 • ఆఫ్ లైన్ లో కొనేవారు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్
  కెవైసి ఫాం : ఐడెంటిటీ ప్రూఫ్ – ఆధార్ కార్డ్- పాన్ కార్డ్- ఫోటో

ఆన్ లైన్ లో ఎలా కొనవచ్చు?

 • ఆన్ లైన్ లో ఎస్ జిబిలు కొనేవారికి భారత ప్రభుత్వం కొన్ని అదనపు ప్రయోజనాల్ని కల్పిస్తుంది. ఒక యూనిట్ లేదా గ్రామ్ కొనుగోలుపై రూ. 50 డిస్కౌంట్ ఇస్తుంది. ఈ పద్ధతిలో కాగితం వాడకం ఉండదు. కెవైసి ప్రాసెస్ కు హార్డ్ కాపీలను ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇంటర్ నెట్ బ్యాంకింగ్ విధానంలో ఏ బ్యాంక్ నుంచైనా, స్టాక్ ఎక్సేంజ్ నుంచైనా కొనవచ్చు. దాదాపు అన్ని బ్యాంకులూ ఈ ఫెసిలిటీ ఇస్తున్నాయి. బ్యాంకుల బిజినెస్ వేళల్లో కొనవచ్చు. బ్యాంకుల ద్వారా కొనేట్టయితే .. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇది కూడా బ్యాంక్ ఇంటర్ నెట్ పోర్టల్ ద్వారా చేయవచ్చు. రిజిస్ట్రేషన్ తర్వాత గోల్డ్ బాండ్ కొనవచ్చు. జెరోడదా, అప్ స్టాక్ వంటి స్టాక్ బ్రోకర్ల ద్వారా కూడా కూడా కొనవచ్చు. ఇందుకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు.
 • సావరిన్ గోల్డ్ బాండ్ ను స్టాక్ ఎక్సేంజ్ లో లేదా సెకండరీ మార్కెట్ లో కూడా కొనవచ్చు. అలాగే బాంబే స్టాక్ ఎక్సేంజ్ ద్వారా ఎస్ జిబి లను కొనవచ్చు. అమ్మవచ్చు.
 • ఇలా చేయండి : ఇంటర్ నెట్ ఓపెన్ చేసి https://ibbs.bseindia.com అని టైప్ చేసి మెంబర్ షిప్ ఐడి/ బ్యాంక్ ఐడి, యూజర్ నేమ్, పాస్ వర్డ్ వివరాలు నమోదు చేసి, లాగిన్ అయి, ఎస్ జిబి అనే ఆప్షన్ కు వెళ్లి ఫారంలో పేర్కొన్న వివరాలు నింపండి. తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేసి, బై ఆర్డర్ ప్లేస్ చేయాలి.

ఎస్ జిబితో ప్రయోజనాలు

 • భద్రత కల పెట్టుబడి: పూర్తి భద్రత, రక్షణ ఉంటుందని హామీ ఇస్తూ భారత ప్రభుత్వం ఎస్ జిబి ని జారీ చేసింది. బంగారం నష్టపోతామని కానీ, చోరీ జరుగుతుందనే భయం ఈ డిజిటల్ బాండ్ వల్ల ఉండదు. డిజిటల్ విధానం కాబట్టి బ్యాంక్ లాకర్ అవసరం, దానికి అయ్యే అదనపు ఖర్చు ఉండవు.
 • స్వచ్ఛమైన బంగారం: రూపాయి ధర ప్రకారం… సగటు క్లోజింగ్ ను ఆధారం చేసుకొని 99.9 శాతం (24 క్యారెట్) స్వచ్ఛమైన బంగారాన్ని బాండ్ రూపంలో పొందవచ్చు.
 • సావరిన్ గోల్డ్ బాండ్ కు జిఎస్ టి (గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ – సరకుపై సేవా పన్ను) ఉండదు.
 • బంగారం నుంచి రెగ్యులర్ (క్రమబద్ధమైన) ఆదాయం: కొనుగోలు విలువపై ఏడాదికి ప్రతి బాండ్ పైనా 2.5 శాతం సాధారణ వడ్డీ వస్తుంది. దాన్ని ఆరు నెలలకొకసారి చెల్లిస్తారు.
 • అదనపు ఛార్జీలు లేకుండా బంగారం: ఎస్ జిబి బంగారం ధరను మాత్రమే పెట్టుబడిదారుడు చెల్లిస్తాడు. స్టోరేజ్ ఛార్జి (నిలవ ఉంచినందుకు చెల్లించే రుసుము), మేకింగ్ ఛార్జి ( తయారు చేసినందుకు చెల్లించే ధర) వంటివి ఉండవు.
 • ముందే వాపస్ తీసుకోవడం: ఎస్ జిబి కి ఎనిమిదేళ్ల కాలపరిమితి ఉంది. అయితే అయిదేళ్ల తర్వాత యూనిట్లను స్టాక్ ఎక్సేంజ్ లో అమ్మవచ్చు.
 • కొనుగోలు పై డిస్కౌంట్: ఎవరైనా ఆన్ లైన్ ద్వారా బంగారాన్ని కొంటే అతడు లేదా ఆమె దానిపై యూనిట్ కొనుగోలు ధరపై 50 రూపాయల డిస్కౌంట్ పొందుతారు.
 • నామినేషన్ : సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ కింద నామినేషన్ సౌకర్యం ఉంది. విడివిడి యూనిట్ కేటాయింపులపై ఒకరు లేదా ఇద్దరిని నామినీలుగా పేర్కొనవచ్చు.
 • ఆర్ బిఐ సర్టిఫికేట్ : పెట్టుబడిపై పెట్టుబడిదారుడికి ఒక సర్టిఫికేట్ గా బాండ్ వస్తుంది. ఆఫ్ లైన్ ఇన్వెస్టర్లు డైరెక్ట్ గా సర్టిఫికేట్ పొందవచ్చు. ఆన్ లైన్ ఇన్వెస్టర్లుకు ఆర్ బిఐ జారీ చేసే సర్టిఫికేట్ సాఫ్ట్ కాపీ వస్తుంది. సర్టిఫికేట్ కాగితం రూపంలో ఉంటుంది కాబట్టి బంగారాన్ని తస్కరిస్తారనే భయం ఉండదు.

ఎస్ జిబి లో కొన్ని లోటుపాట్లు:

 • వడ్డీ రేటు: ఎస్ జిబి అమ్మకంలో వడ్డీ రేటు ఒక కీలకాంశం. ఈ వడ్డీ రేటు కాస్త తక్కువే ఉంటుంది.
 • కాలపరిమితి: ఈ తరహా పెట్టుబడిలో కాలపరిమితి చాలా ఎక్కువ అని చాలామంది పెట్టుబడిదారులు భావించవచ్చు.
 • కేపిటల్ లాస్ (మూలధన నష్టం): అంతర్జాతీయ మార్కెట్ లో బంగారు విలువపై బాండ్ విలువ ముడిపడి ఉంటుంది. అందువల్ల మూలధన నష్టం రావచ్చు. అయితే బంగారం మొత్తం స్థిరంగానే ఉంటుంది.
 • కొనుగోలు పరిమితి: ఒక వ్యక్తి 4 కిలోల బంగారం వరకూ బాండ్ రూపంలో కొనవచ్చు.
 • పన్ను: ఏడాదిలో రెండుసార్లు పొందిన వడ్డీ పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయిదేళ్ల కాలపరిమితి ఎస్ టిసిజి (స్వల్ప కాలిక కేపిటల్ గెయిన్) కంటే ముందు లేదా ఎల్ టిసిజి (లాంగ్ టెర్మ్ కేపిటల్ గెయిన్) కంటే ముందే అమ్మినా పన్ను కట్టాల్సి ఉంటుంది.
 • స్థిరత్వం: బంగారం రేటు స్థిరంగా ఉండదు.

ఎస్ జిబికి , ప్రత్యక్ష్య (ఫిజికల్) బంగారానికీ మధ్య తేడాలు:

సావరిన్ గోల్డ్ బాండ్ —- ఫిజికల్ గోల్డ్
ఎస్ జిబికి సెక్యూరిటీ చాలా ఉంది —- ఫిజికల్ గోల్డ్ కు తక్కువ భద్రత.
స్వచ్ఛత : 24 కేరట్లు —- 22/24 కేరట్లు
లిక్విడిటీ తక్కువ —- ఎక్కువ
గోల్డ్ లోన్ సౌకర్యం రెండింటికీ ఉంది
ఏడాదికి 4 కిలోల వరకూ కొనవచ్చు – పరిమితి లేదు.

ఎస్ జిబి ని జాయింట్ హోల్డింగ్ (ఒకరికంటే ఎక్కువ మంది) పద్ధతిలో తీసుకోవచ్చా?

 • జాయింట్ హోల్డింగ్ తీసుకోవచ్చు. అలాగే, మైనర్ లు కూడా పెట్టుబడి పెట్టవచ్చు. మైనర్ తరఫున లీగల్ గార్డియన్ బాండ్ తీసుకోవచ్చు.
 • ఎస్ జిబిని కాలపరిమితి కంటే ముందే, అంటే కొన్న తేదీ నుంచి అయిదేళ్లు దాటిన తర్వాత స్టాక్ ఎక్సేంజ్ లో అమ్ముకోవచ్చు. వాపస్ తీసుకునేటప్పుడు బాండ్ కాలపరిమితి గురించి నెల ముందుగా బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థకు నెలముందుగా తెలియజేయాలి.
 • బాండ్ ను డైరెక్ట్ బంగారంగా మార్చుకోవచ్చా?… లేదు. అలా వీలుకాదు. ఎస్ జిబిలో పెట్టుబడి చేస్తే మీకు ఇంక ఎలాంటి ఫిజికల్ గోల్డ్ ఉండదు. కాలపరిమితి ముగిసిన తర్వాత అప్పటి మార్కెట్ రేటు ప్రకారం మీకు లభిస్తుంది. ఎస్ జిబిలో పెట్టుబడికి ఆదాయపు పన్ను మినహాయింపు ఉండదు. అయితే, బాండ్ డిమోట్ పద్ధతిలో (డిమెటీరియలైజ్డ్) ఉంటే స్టాక్ ఎక్సేంజ్ లో బాండ్స్ ని అమ్మవచ్చు.
 • పెట్టుబడిదారులకు మరో సందేహం రావచ్చు. ప్రతి ఏటా నాలుగు కిలోల బంగారం కొనవచ్చా అని. కొనవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ – మార్చి మధ్యలో కొనవచ్చు. బాండ్లను డిమోట్ విధానంలో తీసుకోవచ్చు. అయితే, రిజిస్ట్రేషన్ సమయంలో డిమోట్ ఖాతా వివరాల్ని ఇవ్వాల్సి ఉంటుంది. కానీ విధిగా డిమోట్ ఖాతా ఉండాల్సిన అవసరం లేదు. ఇంకో సదుపాయం ఏమిటంటే … ఎస్ జిబి ని బదిలీ చేసుకోవచ్చు.

సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్ చార్ట్

విడత – – సబ్ స్క్రిప్షన్ తేదీ – – జారీ చేసిన తేదీ — వడ్డీ రేటు

ఎస్జిబి సిరీస్-1 — 2021 ఏప్రిల్ 17-21 — 2021 మే 25 — 2.5%

ఎస్జిబి సిరీస్-2 — 2021 మే 24-28 — 2021 జూన్ 01 — 2.5%

ఎస్జిబి సిరీస్-3 — 2021 మే 31- జూన్ 04 — 2021 జూన్ 8 — 2.5%

ఎస్జిబి సిరీస్-4 — 2021 జూలై 12-16 — 2021 జూలై 20 — 2.5%

ఎస్జిబి సిరీస్-5 — 2021 ఆగస్టు 09-13 — 2021 ఆగస్టు 17 — 2.5%

ఎస్జిబి సిరీస్-6 — 2021 ఆగస్టు 30-సెప్టెంబర్ 03 — 2021 సెప్టెంబర్ 07 — 2.5%

ఎస్జిబి సిరీస్-7 — 2021 అక్టోబర్ 25-29 — 2022 నవంబర్ 02 — 2.5%

ఎస్జిబి సిరీస్-8 — 2021 నవంబర్ 29-డిసెంబర్3 — 2021 డిసెంబర్ 07 — 2.5%

ఎస్జిబి సిరీస్-9 — 2022 జనవరి 10 -14 — 2022 జనవరి 18 — 2.5%

ఎస్జిబి సిరీస్-10 — 2022 ఫిబ్రవరి 28 – మార్చి 04 — 2022 మార్చి 08 — 2.5%


Spread the love

Leave a Comment

error: Content is protected !!