ఈ స్కీమ్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి?
పన్ను ఆదా, మంచి రాబడిని ఇచ్చేవాటిలో మరో అద్భుతమైన పథకమే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్(ఇఎల్‌ఎస్‌ఎస్). ఈ స్కీమ్ ద్వారా ఆదాయం పన్ను చట్టం 80సి సెక్షన్ కింద ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల వరకు టాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనికి గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. ఈ పథకంలో పెట్టుబడి 3 సంవత్సరాలు లాక్-ఇన్ కల్గి వుంటుంది. మూడేళ్ల తర్వాత మొత్తం డబ్బును కూడా ఉపసంహరించుకోవచ్చు లేదా అవసరమైనంత వరకు తీసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని మీకు కావలసినంత వరకు ఎఎల్ఎస్ఎస్ లో ఉండనివ్వవచ్చు. ఈ స్కీమ్ లో గరిష్టంగా రూ .1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. రూ.500తో సిప్ (సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ద్వారా ఇఎల్ఎస్ఎస్ లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ఇఎల్ఎస్ఎస్ తో దీర్ఘకాలంలో భారీ మొత్తంలో డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఈ స్కీమ్ తో మరో ప్రయోజనమేమిటంటే పెట్టుబడికి ఎలాంటి పరిమితులు లేవు. ఇతర పొదుపు పథకాలతో పోలిస్తే దీర్ఘకాలంలో అత్యధిక రాబడిని పొందుతారు. దీర్ఘకాలిక లక్ష్యాలను కల్గి ఉంటే ఇఎల్‌ఎస్‌ఎస్‌లో పెట్టుబడి పెట్టడం ఎంతో మంచిది.
పన్ను ప్రయోజనం
ఇఎల్ఎస్ఎస్ ముఖ్య పన్నును ఆదా చేసుకోవడంలో ఉపయోగపడుతుంది. దీనిలో పెట్టుబడి వల్ల ఆదాయం పన్ను చట్టం 80సి సెక్షన్ కింద రూ.1.5 లక్ష వరకు టాక్స్ డిడక్షన్‌కు అర్హత పొందుతారు. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు నగదు విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవు.
మూడేళ్ల లాక్ ఇన్ పిరియడ్
పన్ను ఆదా చేసే పథకాలు తప్పనిసరిగా లాక్ ఇన్ పిరియడ్‌ను కలిగి ఉంటాయి. మనం పిపిఎఫ్ ఖాతానే చూస్తే, ఇది 15 ఏళ్ల లాక్ ఇన్ పిరియడ్ కల్గి ఉంటుంది. ఇక టాక్స్ సేవింగ్ టర్మ్ డిపాజిట్లు ఐదేళ్ల లాక్ ఇన్ పిరియడ్‌ను కలిగి ఉంటాయి. ఇఎల్‌ఎస్‌ఎస్ లాక్ ఇన్ పిరియడ్ మూడేళ్లు, ఇన్వెస్ట్‌మెంట్ కు కనీసం ఐదేళ్ల కాలపరిమితి అవసరమని, ఇలా చేస్తే సురక్షితమని చెబుతారు.
రాబడిపై 10 శాతం పన్ను
ఈ ఇఎల్‌ఎస్‌ఎస్ దీర్ఘకాల మూలధన రాబడిపై 10 శాతం పన్ను చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. 2018 సంవత్సరంలో ప్రభుత్వం 10 శాతం ఎల్‌టిసిజి(లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్) పన్నును ప్రవేశపెట్టింది. దీని వల్ల ఈక్విటీ పథకాలపై రూ.1 లక్షకు పైగా దీర్ఘకాలిక మూలధన రాబడిని పొందితే 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
నో మెచ్యూరిటీ టైమ్
ఇఎల్‌ఎస్‌ఎస్ స్కీమ్‌కు ఎలాంటి ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ అనేది ఉండదు, అంతేకాదు ఎంత కాలం కావాలంటే అంత కాలం దీనిని కొనసాగించవచ్చు. అయితే పిపిఎఫ్, పన్ను ఆదా డిపాజిట్లు వంటి చాలా వరకు టాక్స్ సేవింగ్ పెట్టుబడులకు మాత్రం మెచ్యూరిటీ తేదీ ఉంటుంది. ఇక పిపిఎఫ్ ఖాతానే చూస్తే, దీనికి 15 ఏళ్లకు మెచ్యూరిటీ ఉంటుంది.