డబ్బు సంపాదించడం కష్టమేం కాదు

Spread the love

మనీ మంత్ర కాదు.. ఇది జీవిత మంత్ర

కళ్లు తెరవండోయ్ బాబూ.. పొదుపు చేయండోయ్

డబ్బు సంపాదించడం కష్టమేం కాదు.. అని అంటే.. అవునా.. అంటూ ఆశ్చర్యంగా చూస్తారు.. కానీ ఇది నిజం, కోట్లు సంపాదించాలంటే కొంత, ఓపిక, మొక్కవోని సంకల్పం ఉండాలి. సంపాదించిన డబ్బును జాగ్రత్తగా ఎక్కడ, ఎటువంటి సాధనాల్లో దాచుకోవాలనేది తెలుసుకోవాలి. ఇది కూడా ఒక కళ.. మీరు పొదుపు చేయాలనుకుంటే మీ ఖర్చులు తగ్గించుకోవాలి. ఖర్చులను అదుపు చేసుకుంటే మీ కష్టార్జితాన్ని జాగ్రత్తగా పెంచుకోవచ్చు. కానీ మీరు ఎంత సంపాదిస్తున్నారు? ఎంత పొదుపు చేయగలరు అనేదే సమస్య. పొదుపు చేయడానికి చిట్కాలూ ఉన్నాయి. చిన్న మొత్తమైనా ఆపకుండా పొదుపు చేసుకుంటూ పోతే అది మీ జీవితాన్నే మార్చేస్తుంది.

పొదుపునకు అనేక మార్గాలున్నాయ్..

సేవింగ్స్ అంటే ఏమిటో మనందరికీ తెలుసు. తెలిసినా ఎంతమంది వెంటనే సేవింగ్స్ ను ప్రారంభిస్తున్నారు. చాలా తక్కువ మంది. పొదుపు మనవల్ల కాదు, ఇప్పుడు కుదరదులే. మన ఆదాయం పెరిగినప్పుడు చూద్దాం, అప్పుడు చాలా ఎక్కువ పొదుపు చేయవచ్చు అనుకుంటాం. కానీ ఈ ఆలోచన సరైనది కాదు. రోజులు గడిచేకొద్దీ డబ్బు అవసరమవుతుంది. డబ్బు ఎక్కువ కావడానికి కొంత సమయం అవసరం. కాబట్టి ఇప్పుడే పొదుపు మొదలు పెడితే భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుంది. ఆలస్యం చేసేకొద్దీ కాలం గడిచిపోతుంది, అప్పుడు తక్కువగానే కూడబెట్టగలం. ఖర్చులు పెరుగుతాయి. కూడబెట్టింది చాలదు. పొదుపు చేయడం అంత కష్టమేమే కాదు. దీనికి ముఖ్యంగా కావలసింది మానసికంగా సిద్ధపడడం. మనకొచ్చే దాన్లో రెగ్యులర్ గా కొంత సేవ్ చేద్దాం అనే సంకల్పం కావాలి. ఎక్కువ పొదుపు చేస్తున్నామా? తక్కువ మొత్తం సేవ్ చేస్తున్నామా అనేది ముఖ్యం కాదు. ఎంత తక్కువ మొత్తం అయినా … అసలు ప్రారంభించడమనేది ముఖ్యం. రెండేళ్ల తర్వాత మీకే తెలుస్తుంది ఆ చిన్న మొత్తాల విలువ ఏమిటో. ఆ.. ఇంక కొన్ని చిట్కాలు చూద్దామా.

ఖర్చుల్ని తగ్గించుకోండి

మనం ఖర్చులు చేస్తాం. తప్పదు. మనం హాయిగా, మంచి సదుపాయాలతో బతకడానికి సంపాదిస్తాం. కానీ ప్రతిది కొని, అనసవరమైన సౌకర్యాలు వద్దు. ఇక్కడే మనం పొదుపు చేయడంలో సమస్యలు వచ్చేది. ఇదే చాలా కీలకమైన, క్లిష్టమైన ప్రశ్న. సరే అది వదిలేద్దాం. సులభంగా ఎలా సేవింగ్స్ చేయవచ్చో చూద్దాం. ఒకవేళ మీరు డబ్బును కూడబెట్టదలుచుకుంటే మీ ఖర్చుల్ని కంట్రోల్ చేసుకోవాలి. మీరు చేసే పెద్ద ఖర్చులేమిటి? చిన్న చిన్న ఖర్చులేమిటి? అనేది ఆలోచించి, వాటిని కాగితంపై పెట్టడానికి ప్రయత్నించండి. వాటిని ఒక పుస్తకంలో లేదా పెద్ద కాగితంపై రాసుకోండి లేదా మీ మొబైల్ లో నోట్ చేసుకోండి. మీ ఖర్చుల్ని ఇలా డివైడ్ చేయండి. ఉదాహరణకు -అద్దె, యుటిలిటీ బిల్స్, ఎంటర్ టైన్ మెంట్, ప్రయాణాలు, ఇఎంఐ ల వంటివి. ఒకసారి మీరు ఖర్చుల నోట్స్ రెగ్యులర్ గా రాయడం అనేది స్టార్ట్ చేస్తే ముందు ముందు వాటిని సరైనా దారిలో పెట్టగలరు. కొంతకాలం తర్వాత మీరు గతంలో చేసిన ఖర్చులు, అవి అవసరమా.. లేదా.. గుర్తించడం సులభమవుతుంది. మీరు ఎంత నష్టపోయారు? ఎంత మొత్తం పొదుపు చేయగలిగేవారో ఆ వివరాలు వెల్లడిస్తాయి.

అప్పు చేయడం తప్పు కాదు కానీ..

అప్పు చెడ్డదేం కాదు. డబ్బు అత్యవసరమైన అవసరాలు తీరడానికి లేదా ఇల్లు, కారు వంటి స్థిరాస్తులు కొనేటప్పుడు అప్పు చేయడం చాలా సహజం. అన్ని లోన్ల ద్వారా మీరు తీసుకున్న డబ్బును అప్పు అంటారు. అప్పుగా మీరు తీసుకున్న సొమ్ము మీది కాదు. కొంత అదనపు వడ్డీతో ఆ అప్పును తీర్చక తప్పదు. మీరు డబ్బును కూడబెట్టాలనుకుంటే ముందు మీకు అప్పు అనేది ఉండకూడదు. అసలు ఏ అప్పు లేకపోవడం సాధ్యం కాకుంటే కనీసం దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దీర్ఘ కాలిక రుణాలు తీసుకున్న తర్వాత వాటిని తీర్చడానికి ఎంత చెల్లిస్తున్నదీ తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఆ అప్పు చెల్లించే సమయానికి అసలు కన్నా రెట్టింపు, మూడు రెట్లు లేదా అంతకన్నాఎక్కువ చెల్లిస్తాం. అందువల్ల అనవసరంగా రుణాల్ని తీసుకోవద్దు. ఈ చిన్న అడుగు మీ ఆర్థిక సుస్థిరతపై చాలా ప్రభావం చూపుతుంది.

అప్పులు తీర్చండి, కానీ దూకుడు వద్దు

తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడం చాలా ముఖ్యం. తీసుకున్న అప్పులు చెల్లించకుంటే అది తప్పనిసరిగా మీ క్రెడిట్ రేటింగ్స్ ను దెబ్బతీస్తుంది. అంతేకాదు మీకు అప్పు ఇచ్చేవాళ్లు ఇకనుంచి మీకు అప్పు ఇవ్వడానికి ఇష్టపడరు. ముందుకు రారు. కాబట్టి అప్పులు తీర్చడమే ఎప్పటికీ మంచిది. మొదట మీ అప్పు తీర్చి ఆ తర్వాత పెట్టుబడి పెడదామనో, పొదుపు చేద్దామనో అనుకునేవారు ఉంటారు. అది సరైన పద్ధతి కాదు. కానీ, మీ సేవింగ్స్ ను ఆపేసి, అప్పులు తీర్చడం మంచి ఆలోచన కాకపోవచ్చు. మీరు పొదుపు చేసేది చిన్న మొత్తమే కావచ్చు. కానీ, మీ ఇఎంఐలతో పాటు కొంత డబ్బును కూడా సేవ్ చేయాలి.

ఇఎంఐ వలలో చిక్కుకో వద్దు

ఇఎంఐ అంటే ఈక్వేటెడ్ మనీ ఇన్ స్టాల్ మెంట్. ఈ ఇఎంఐలు కొత్త వస్తువులు కొనుక్కోడానికి తోడ్పడతాయి. కానీ మీకు అప్పిచ్చేవాళ్లు తాము సులభంగా డబ్బు సంపాదించేందుకు కనిపెట్టిన విధానమే ఇఎంఐ. ఏదైనా వస్తువును ఒకేసారి డబ్బు పెట్టి కొనకుండా వాయిదాల పద్ధతిలో డబ్బు కట్టడం ఇఎంఐ. దీని ద్వారా ఏ వస్తువూ ఫ్రీగా రాదు. కేవలం మనకు కొంత టైంను కొనుక్కుంటున్నాం. అంతే పైగా ఈ పద్ధతిలో ఏదైనా కొంటే అసలుతో పాటు అదనంగా వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజులు వంటివి కూడా కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇఎంఐలపై ఆధారపడకుండా పూర్తి సొమ్ము చెల్లించి కొనేందుకు ప్రయత్నించండి. ఇఎంఐలను తగ్గించుకుంటే 10 నుంచి 30 శాతం వరకు, ఇంకా అంతకంటే ఎక్కువ డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న సేవింగ్స్ కాలక్రమంలో ఆకర్షణీయమైన కార్పస్ (ప్రత్యేక ప్రయోజనంకోసం ఏర్పాటు చేసే కేంద్ర నిధి) ఫండ్ గా మారవచ్చు కూడా.

క్రెడిట్ కార్డ్ వాడకాన్ని తగ్గించండి

అప్పు చేయడానికి క్రెడిట్ కార్డులు మంచి సాధనాలుగా, వస్తువులు కొనడానికి సమర్థవంతంగా పనిచేస్తాయి, పేమెంట్స్ ను ఇఎంఐలుగా మార్చడానికి బాగా ఉపయోగపడుతున్నాయి. అవసరమున్నా లేకున్నా ప్రతిదానికీ విచ్చలవిడిగా క్రెడిట్ కార్డ్ వాడేందుకు అలవాటు పడితే, క్రమంగా మనం అప్పుల ఉచ్చులో చిక్కుకునే ప్రమాదం ఉంది. క్రెడిట్ కార్డ్ తో కొనడం పరిమితం చేసుకోవాలి. క్రెడిట్ కార్డు అప్పును చెల్లించడంలో విఫలమైతే, కార్డు జారీ చేసిన వారు ఎక్కువ వడ్డీ రేటు ఛార్జి చేస్తారు.

మినిమం డ్యూ ట్రాప్:

మీరు తీర్చాల్సిన అప్పు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, పేమెంట్ డేట్ లోగా చెల్లించగల చిన్న మొత్తాన్ని ‘మినిమం డ్యూ’ అంటారు. ఇది కూడా ఓ ఉచ్చు (ట్రాప్) లాంటిదే. ఈ మినిమం డ్యూ ట్రాప్ లో పడకండి. ఈ సదుపాయం ఉండడం మీకు మేలు చేయదు. ఎందుకంటే మీరు ఇది చెల్లించినా అసలు కానీ, వడ్డీ కానీ చెల్లించడం లేదు. మీరు లైఫ్ టైంకు కేవలం పెనాల్టీ కడుతున్నారు. అంతే.

ఎక్కువ పర్సనల్ లోన్స్ నివారించండి:

అత్యవసరమైనప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిదే. కొలాటరల్ లేకుండా తక్కువ టైంలో అనుమతి దొరుకుతుంది. కానీ ఒకటి బాగా గుర్తుంచుకోండి. పర్సనల్ లోన్స్ (వ్యక్తిగత రుణాలు) తీసుకుంటే ఇంట్రెస్ట్ రేటు బాగా ఎక్కువగా అంటే ఏడాదికి 14 నుంచి 20 శాతం లేదా అంతకన్నా ఎక్కువ కూడా ఉండవచ్చు. మీరు డిబిట్ ఫ్రీగా లేదా అప్పు లేకుండా ఉండాలంటే, సాధ్యమైనంత వరకూ (అత్యవసరమైతే తప్ప) పర్సనల్ లోన్స్ కు వెళ్లకండి.

ఉపయోగించని మంత్లీ సబ్ స్క్రిప్షన్లు వద్దు

సమాచారాన్ని, వినోదాన్ని పొందడంలో తప్పు లేదు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి వాటిలో పెయిడ్ సర్వీసులకు (ఆర్జిత సేవలు) కొరత లేదు. ఒకవేళ మీకు అనేక పెయిడ్ సర్వీసుల సబ్ స్క్రిప్షన్లు కల్గి ఉండి, వాటిలో దేనినైనా వాడుకోకుంటే, మరో ఆలోచన లేకుండా వాటిని రద్దు చేసుకోండి. వాటికి బదులు ఆ చిన్న మొత్తం సొమ్మును నెలనెలా ఆదా చేస్తే, రెండేళ్ల తర్వాత పెద్ద మొత్తాన్ని కూడబెట్టవచ్చు.

దీనికి తరువాయి రెండో భాగంలో…

ధనవంతులు కావాలంటే ఆర్థిక లక్ష్యాలు ఉండాలి..

Spread the love

Leave a Comment

error: Content is protected !!