దీంతో వస్తువులు కొనవచ్చా? లావాదేవీలు జరపొచ్చా? భవిష్యత్ క్రిప్టో కరెన్సీదేనా?
క్రిప్టో కరెన్సీపై భారత్ లోనే కాదు, ప్రపంచం వ్యాప్తంగా తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇదేంటో సామాన్యుడికి ఓ పట్టాన అర్థం కాదు. కానీ సింపుల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే మన భారతీయ కరెన్సీ రూపాయి, అమెరికా కరెన్సీ డాలర్, చైనా కరెన్సీ యెన్, బ్రిటన్ కరెన్సీ పౌండ్ వంటిదే ఈ క్రిప్టోకరెన్సీ.. అయితే ఇది ఒక డిజిటల్ అంటే వర్చువల్ కరెన్సీ అన్నమాట. ఈ వర్చువల్ కరెన్సీ క్రిప్టోగ్రఫీ సూత్రంపై పనిచేసే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ నుండి తయారు చేశారు. అందుకే దీనిని క్రిప్టోకరెన్సీ అని అంటారు. మన రూపాయి, డాలర్, యెన్, ఇంకా పౌండ్ వంటివి వాటి దేశాల సెంట్రల్ బ్యాంకుల నియంత్రణలో పనిచేస్తాయి. అంతేకాదు మన కరెన్సీ ఎంత, ఎప్పుడు ముద్రించాలనేది దేశ ఆర్థిక పరిస్థితి ఆధారంగా నిర్ణయిస్తారు. కానీ క్రిప్టోకరెన్సీలపై ఎవరి నియంత్రణా ఉండదు, ఇది పూర్తిగా వికేంద్రీకృత వ్యవస్థ అనే చెప్పాలి. దీనికి ఏ ప్రభుత్వం లేదా సెంట్రల్ బ్యాంక్ నియంత్రణ ఉండదు. అందుకే ఈ కరెన్సీలో తీవ్ర అస్థిరత ఉంటుంది. అయితే దీనిని హ్యాక్ చేయడం గానీ, తారుమారు చేయడం గానీ కుదరదు. క్రిప్టోకరెన్సీకి ఉదాహరణ బిట్ కాయిన్, ఇథోరియం వంటివి. వీటితో ఆర్థిక లావాదేవీలు ప్రత్యక్ష లావాదేవీలుగా కాకుండా ఆన్ లైన్లో మాత్రమే జరుగుతాయి.
భారత్ లో బ్యాంకులు క్రిప్టో కరెన్సీ లావాదేవీలు జరపకూడదని రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించింది. అయితే ఇటీవల సుప్రీంకోర్టు రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల్ని కొట్టివేస్తూ భారతదేశ బ్యాంకుల్లో క్రిప్టొ కరెన్సీ లావాదేవీలకు అనుమతిచ్చింది. పెట్టుబడులకు క్రిప్టో కరెన్సీ ఇవాళ ప్రపంచంలోనే ఒక బలమైన శక్తిగా మారింది. మొదట్లో ప్రయోగాత్మకంగా మొదలైన ఈ డిజిటల్ కరెన్సీ విధానం చాలాకాలం అదే స్థాయిలో నడిచింది. ఇప్పుడు పెట్టుబడిదారులకు లాభాల పంట పండిస్తోంది. చాలా మంది తక్కువ రేటులో క్రిప్టోకరెన్సీలను కొని లాభపడ్డారు. అదే సమయంలో దీనిలో ఉంటే తీవ్రమైన హెచ్చుతగ్గులతో నష్టపోయిన వారూ ఉన్నారు. ఇదే సమయంలో కొన్ని వేల డిజిటల్ కరెన్సీలు సందడి చేస్తుండడంతో ఇన్వెస్టర్లలో కొంత భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు నెలనెలా కొత్త డిజిటల్ కరెన్సీలు పుట్టుకొస్తున్నాయి.
క్రిప్టో కరెన్సీ లేదా ‘క్రిప్టో’ ఒక డిజిటల్ కరెన్సీ, దీంతో వినియోగదారుడు వస్తువులు కొనవచ్చు. సేవలు పొందవచ్చు. దీంతో వ్యాపారం చేసి లాభాలూ పొందవచ్చు. ఇది ఆన్ లైన్ ద్వారానే పనిచేసే సురక్షితమైన సిస్టమ్. పెట్టుబడిదారులు తమ డిజిటల్ ఎసెట్స్ ను నిలవ చేసుకునే విధానాలున్నాయి. ఎసెట్స్ కొనడం, అమ్మడంలో లావాదేవీలు పారదర్శకంగా, సూటిగా స్పష్టంగా ఉంటాయి. వినడానికి ఇదంతా సులభంగా, అర్థమైనట్టు కనిపించినా వేలకొద్దీ ఎక్సేంజ్ లు ఉన్నందువల్ల కొంత ఆందోళనకు గురయ్యే సందర్భాలూ ఉన్నాయి. క్రిప్టో కరెన్సీ పెట్టుబడులలో విజయం సాధించడంలో సరైన డిజిటల్ కరెన్సీని లేదా క్రిప్టో కరెన్సీని ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. క్రిప్టోకరెన్సీపై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి. దీనిని ఎలా కొనాలి, ఎలా పెట్టుబడి పెట్టాలి, ఏది సురక్షితం, ఏది సురక్షితం కాదు, మోసం ఎలా జరుగుతుంది. వాటి గురించి తెలుసుకోవాలి. ఈ కింద చూపిన సందేహాలను నివృత్తి చేస్తే మీకు పూర్తిగా అవగాహన వస్తుంది.
క్రిప్టోకరెన్సీపై అనేక సందేహాలు
మొదటిది 1.క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది?
రెండోది 2.క్రిప్టో కరెన్సీని ఎలా కొంటారు, దీనికి ఇన్ కమ్ టాక్స్ అనేది ఉంటుందా?
మూడోది 3. భారతదేశంలో క్రిప్టోకరెన్సీలు చాలా పాపులర్ కావడానికి కారణాలు ఏమిటి?
నాలుగోది 4.మన భారతదేశంలో ఈ క్రిప్టో లావాదేవీలు జరుగుతాయా, వీటికి చట్టబద్ధత అనేది ఉందా?
ఐదోది 5. ప్రస్తుత సంవత్సరంలో(2021) దేశంలో పెట్టుబడి అనువైన ముఖ్యమైన కరెన్సీలు ఏమిటి?
ఆరోది 6. క్రిప్టో కరెన్సీని కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
ఏడోది 7.క్రిప్టో కరెన్సీ మోసాలను నివారించడం ఎలా?
ఎనిమిదోది 8. ఈ క్రిప్టోకరెన్సీలో ఎంత మేరకు పెట్టుబడి పెట్టాలి?
పూర్వకాలంలో ఇప్పటిలా కరెన్సీ నోట్లు, నాణేల రూపంలో ఉండేది కాదు
అప్పట్లో బార్టర్ సిస్టం అంటే వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. కొంతకాలానికి కొన్ని కారణాల వల్ల ఆ పద్ధతి అంతరించింది. ఆ తర్వాత ఎన్నో పరిశోధనలు చేసి, ఇప్పుడు వాడుకలో ఉన్న నోట్లు, నాణేల పద్ధతిని కనిపెట్టారు. దానికి ప్రపంచమంతటా మంచి ప్రజాదరణ లభించింది. అయితే కొంతకాలం కిందట డిజిటల్ మనీ కూడా చెలామణిలోకి వచ్చింది. అసలు మనీని డైరెక్ట్ గా వాడుకుంటున్నాం. డిజిటల్ మనీ డెబిట్, క్రెడిట్ కార్డులు, ఎలక్ట్రానిక్ వాలెట్ల రూపంలో ఉంది. కేంద్ర లేదా ఉమ్మడి అధికార వ్యవస్థలు వాటిని నియంత్రిస్తున్నాయి. క్రిప్టోగ్రఫీ గురించి చెప్పాలంటే … ఇది డిజిటల్ కరెన్సీ ఆలోచన నుంచి పుట్టిందే. లావాదేవీలకు, నిర్వహణకు సర్వర్లు వంటివి అవసరం లేదు. ఇది డైరెక్ట్ గా కనబడదు. వికేంద్రీకరణ విధానంలో పనిచేస్తుంది. ఆర్థిక లావాదేవీలు, వ్యాపార వ్యవహారాల్లో దీన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇది డి సెంట్రలైజ్డ్ మనీ కనుక ఏ ప్రభుత్వం లేదా ప్రభుత్వాలు కానీ దీనిని నియంత్రించలేవు. క్రిప్టో కరెన్సీ వ్యవస్థ కూడా క్రిప్టోగ్రఫీ నియమాలతోనే పనిచేస్తుంది. క్రిప్టోగ్రఫీలో సమాచార గోప్యత ఉంటుంది. కొన్ని కోడ్ ల రూపంలో సమాచారాన్ని కావలసిన వారికి అందిస్తాారు. క్రిప్ట్ అంటే ‘దాచినది’ అని అర్థం. గ్రఫీ అంటే రైటింగ్. ఈ సిస్టంలో నకిలీలకు, మోసాలకు తావు లేదు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా వివిధ కరెన్సీలను డీ సెంట్రలైజ్ నెట్ వర్క్ తో కలిపారు. వాటిని బ్లాక్స్ అంటారు. ప్రతి కరెన్సీని అవి కలపడమే కాకుండా సెక్యూరిటీ కూడా ఇస్తాయి. వీటి గురించి సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం.
క్రిప్టో కరెన్సీని కొనడం ఎలా?
మార్కెట్ రీసెర్చ్ ప్రకారం, ప్రస్తుతం 700 రకాల క్రిప్టో కరెన్సీలు ట్రేడ్ అవుతున్నాయి. వీటి నంబర్ ఇంకా పెరగవచ్చు కూడా. ఇనిషియల్ కాయిన్ ఆఫరింగ్స్ (ఐసిఓ) ద్వారా నిధులు సమకూర్చుకుంటున్నారు. అదలా ఉంచితే …అసలు వీటిని ఎలా కొనవచ్చు? అనేది చూద్దాం. ఏముంది? చాలా సులభం. మీరు మొదట డిజిటల్ వాలెట్ ను ఓపెన్ చేయాలి. దీనికి చాలా యాప్ లు ఉన్నాయి. వీటితో ఈ కరెన్సీని కొనేందుకు, ఉపయోగించేందుకు, వస్తువులు కొనడం, అమ్మడం లేదా సేవలు పొందడానికి మీకు అర్హత వస్తుంది.
క్రిప్టో కరెన్సీ లావాదేవీలు మొదట బిట్ కాయిన్ తో మొదలయ్యాయి. 2009 లో బిట్ కాయిన్ స్టార్డ్ అయింది. చాలా తక్కువ టైంలోనే అది బిజినెస్ వరల్డ్ ను ముంచెత్తింది. 2017 లో దాని విలువ ఒక కాయిన్ కు 1000 డాలర్లు ఉంది. ఇప్పుడు దాని విలువ 61,887 డాలర్లకు చేరింది. అంటే భారత కరెన్సీలో ఒక బిట్ కాయిన్ విలువ రూ.46,36,304 ఉంది. ఇది త్వరలో లక్ష డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ఒక బిట్ కాయిన్ రూ.75 లక్షల డాలర్లకు చేరుకోనుందన్న మాట. ఈ బిట్ కాయిన్ కొన్న వారికి లాభాలూ బ్రహ్మాండంగా వచ్చాయి. బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలు ఇథోరియం, లైట్ కాయిన్, డార్క్ కాయిన్, డాష్ వంటివి చాలా కరెన్సీలు వచ్చాయి. వీటి విలువ కూడా మార్కెట్ లో బాగా పెరుగుతూనే ఉంది.
క్రిప్టోకు పన్ను చెల్లించాల్సి ఉంటుందా?
దేశీయంగా రూపాయితో లావాదేవీలకు పన్నులు ఉంటాయి. ఇది అందరికీ తెలుసు. అయితే క్రిప్టో మన కరెన్సీ కాదు కదా, వీటిలో పెట్టుబడులకు టాక్స్ పడదని, కట్టాల్సిన పనిలేదని మాత్రం అనుకోవద్దు. డిసెంట్రలైజ్ చేసినా, ఏదైనా సెంట్రల్ అథారిటీ లేదా ప్రభుత్వ నియంత్రణ పరిధిలో లేకున్నా క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు కూడా టాక్స్ ఉంది. చట్టం ప్రకారం భారతదేశంలో ఎవరు ఏ విధమైన ఆదాయం పొందినా దానికి పన్ను కట్టాలి. ఇతరత్రా పెట్టుబడుల్లో మీరు లాభాలు పొందుతారు కాబట్టి ట్యాక్స్ కడతారు కదా. అలాగే క్రిప్టో కరెన్సీ పెట్టుబడులకు కూడా ప్రాఫిట్ వస్తుంది. అందువల్ల ఇన్ కం ట్యాక్స్ చట్టం ప్రకారం పన్ను కట్టాల్సి ఉంటుంది. ఆ కరెన్సీ మీ దగ్గర ఉన్నంత కాలాన్ని బట్టి లాంగ్ టర్మ్, షార్త్ టెర్మ్ గెయిన్స్ గా విభజిస్తారు. అలాగే ఒక్కోసారి ఇతర ఆదాయ మార్గాలు, వాటి రిటర్న్స్ ఆధారంగా కూడా డిసైడ్ చేస్తారు. అయితే క్రిప్టో కరెన్సీ ఒక కరెన్సీనా లేక వస్తువా అన్నది ఇంకా తేలలేదు. మార్కెట్ పై ఒక స్పష్టమైన నియంత్రణ వచ్చేదాకా, ఈ ఎసెట్స్ పై ఎంత పన్ను పడుతుందో చెప్పలేం.
పెట్టుబడి పెట్టడానికి ముందు పాటించాల్సిన కీలకాంశాలు:
- పెట్టుబడి పెట్టేందుకు ముందు క్రిప్టో కరెన్సీల గురించి పూర్తిగా స్టడీ చేసి, అర్థం చేసుకోవాలి. క్రిప్టో మార్కెట్ లో ఎదురయ్యే సమస్యల గురించి తెలుసుసుకుని, దేనీలో ఇన్వెస్ట్ చేయబోతున్నామో అనే దానిపై పూర్తి అవగాహనకు రావాలి.
- మొదట ఎంత పెట్టుబడి పెట్టాలనేది మన స్తోమతను బట్టి డిసైడ్ చేసుకుంటే మంచిది. . క్రిప్టోలో పెట్టుబడికి సరైన ఒక ప్లాట్ ఫాంను ఎంచుకోవడం, క్రిప్టో వాలెట్ ను పొందడం చేయాలి.
- ఇంకా కాయిన్స్ ను స్టోర్ చేసుకోవడానికి నాలుగు పద్ధతులు ఉన్నాయి. హాట్ వాలెట్స్. కోల్డ్ వాలెట్స్. హార్డ్ వేర్ వాలెట్స్. పేపర్ వాలెట్స్. వీటి గురించి తెలుసుకోవాలి.
- క్రిప్టో మార్కెట్లో డిమాండ్ ను బట్టి ఇన్వెస్టర్ పెట్టుబడికి రకరకాల వ్యూహాలను ఎంచుకోవచ్చు
- క్రిప్టో పెట్టుబడికి ముఖ్యమైన అయిదు పద్ధతులు ఉన్నాయి. అవి క్రిప్టో సి ఎఫ్ డి. డే ట్రేడింగ్, బిట్ కాయిన్ మైనింగ్, ఆర్బిట్రేజ్, క్రిప్టో ఫాసెట్స్.
- పెట్టుబడికి ముందు మార్కెట్ లో బాగా ఆదరణ ఉన్నవి, నిరంతరం లాభాల్ని ఇచ్చేవాటిని ఎంచుకోవాలి. 80/20 పారటో ప్రిన్సిపల్ ప్రకారం భారీ పెట్టుబడులు ఎక్కువ రెవెన్యూ ఇస్తాయి.
గమనిక ..
క్రిప్టో మార్కెట్ చాలా హెచ్చుతగ్గులకు గురవుతుంది. ఇది ఎంతో రిస్క్ తో కూడినది. ఈ క్రిప్టో కరెన్సీలో భారీ లాభాలు కనిపిస్తాయి. అంతేవిధంగా భారీ నష్టాలను కూడా తెచ్చిపెడ్తాయి. కొనే ముందు వినియోగదారులు తమ వ్యక్తిగత సలహాదారుల సలహా తీసుకోవాలి. ఇది అవగాహన కోసం మాత్రమే, తెలుగుపైసా.కామ్ ఇన్వెస్ట్ చేయమని సలహా ఇవ్వదు, ఎలాంటి బాధ్యత వహించబోదు.
https://telugupaisa.com/%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8b%e0%b0%95%e0%b0%b0%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%80-%e0%b0%87%e0%b0%82%e0%b0%a4-%e0%b0%aa%e0%b0%be%e0%b0%aa%e0%b1%81/