అజాగ్రత్తగా ఉంటే ఐటి నోటీసులు పంపుతుంది
ఆదాయం పన్ను పరిధిలో ఉన్నవారు ఐటిఆర్ (Income Tax Returns) దాఖలు చేయడం తప్పనిసరి. ఒకవేళ ఆదాయం పన్ను చెల్లించకపోయినా, లేకపోతే తప్పించుకున్నా ఐటి శాఖ నోటీసులు పంపుతుంది. మనం ఐటి నోటీసులు పంపకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కొన్ని తప్పులు చేయడం వల్ల ఐటి నోటీసులు పంపుతుంది. ITR దాఖలు చేసే సమయంలో చేసే కొన్ని తప్పులు ఏమిటో తెలుసుకుందాం. ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త వహిస్తే మనం ఐటి నోటీసులు రాకుండా జాగ్రత్త పడొచ్చు. అవేంటో తెలుసుకుందాం.
గడువులోగా ITRని దాఖలు చేయాలి
సాధారణంగా అందరూ చేసే తప్పేంటి అంటే, గడువు లోపే ఆదాయం పన్ను రిటర్న్ ను దాఖలు చేయకపోవడం. సకాలంలో ఐటిఆర్ దాఖలు చేయకపోతే మాత్రం ఐటి శాఖ నోటీసులు పంపుతుంది. ఇంకా సమయం ఉంది కదా.. అనే నిర్లక్ష్యం వద్దు. అలాగే గడువు ఆఖరి రోజు దాఖలు కూడా చేయొద్దు. చాలా మంది ఐటిఆర్ ను ఆఖరి రోజు ఆదరా బాదరాగా చేస్తారు. దీని వల్ల పూరించడంలో తప్పిదాలు, వెబ్ సైట్ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో సమయం మించిపోతే దాఖలు కాకుండా పోయే ముప్పు కూడా ఉంది.
అసెస్ మెంట్ ఇయర్ 2021-22 కు ఐటి రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఆఖరు తేదీని సిబిడిటి 2021 డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఈ గడువుకు ముందే మీరు ఐటి రిటర్న్స్ ను దాఖలు చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు. ఆలస్యం చేస్తూ ఆఖరి రోజున దాఖలు చేస్తే సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ITR ఇ-వెరిఫికేషన్
ఐటిఆర్ లో ఇ- వెరిఫికేషన్ మరో ముఖ్యమైన విషయం. ITR ఇ- వెరిఫికేషన్ ను ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఐటి రిటర్న్స్ దాఖలు చేసిన తర్వాత ఇ- వెరిఫికేషన్ కు సుమారు 120 రోజులు తీసుకుంటుంది. అయితే వీలైనంత త్వరగా ఇ- వెరిఫికేషన్ ను పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు ఇ- వెరిఫికేషన్ చేయకపోతే ఐటిఆర్ ప్రక్రియ ముందుకు సాగదు. అంతేకాదు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మీకు నోటీసులు వస్తాయి.
ఆదాయం- టిడిఎస్ సమాచారంలో తేడాలు
ఆదాయం విషయంలో ఒక సమాచారం, టిడిఎస్ కు మరోలా సమాచారం ఇస్తున్నారా.. మీరు తప్పులో కాలేసినట్టే. ఆదాయ వనరులపై ఎంత పన్ను పడుతుందనే ఫారం 26 ఎఎస్ తో తెలుసుకోవచ్చు. పాన్ కార్డు ఆధారంగా ఈ సమాచారం అందుబాటులో ఉంటుందనే విషయం తెలుసుకోవాలి. ఫారమ్ 16, ఫారమ్ 26 ఏఎస్‌లను సరిపోల్చి చూసుకోవాలి. పోల్చుకున్న తర్వాత భిన్నంగా ఉంటే ఐటి శాఖ నోటీసులు పంపుతుంది.
సరైన ఐటిఆర్ ఫారం ఎంచుకోండి
పన్ను చెల్లింపుదారులు చేసే రెండో తప్పు ఏమిటంటే ఐటిఆర్ దాఖలు చేసేటప్పుడు సరైన ఫారం ఎంపిక చేసుకోకపోవడం. అవును చాలా మంది ఇలా ఐటిఆర్ దాఖలు చేస్తారు. తొందరపడొద్దు, మన ఆదాయం, వచ్చే వనరులకు సంబంధించి ఏ ITR సరైందో తెలుసుకోవాలి. సరైన ఐటిఆర్ ఫారమ్ నుం ఎంపిక చేసుకోకపోతే ఐటి శాఖ నుంచి నోటీసులు రావడం ఖాయం.
ఆదాయం వనరులు ఏమిటి
ప్రతి ఒక్కరికి ఆదాయం ఏవిధంగా వస్తుంది, వారు చేసే పని నుంచి అనే విషయం అందిరికీ తెలుసు. అయితే ఈ విషయాన్ని ఐటి రిటర్న్స్ లో చెప్పకపోతే మాత్రం ఇరకాటంలో పడ్డట్టే. ఆదాయం మూలాలు (ఇన్కమ్ సోర్స్) ఏమిటి తప్పకుండా చెప్పాల్సి ఉంటుంది. పొరపాటున ఆదాయ వనరులను వెల్లడించకపోతే ఐటి నుంచి నోటీసులు వస్తాయి. వనరుల గురించి పూర్తి సమాచారం మనం ఐటి రిటర్న్స్ లో ఇవ్వాలి. ఐటి శాఖ పరిశీలనలో ఏదైనా మిస్ మ్యాచ్ అయితే మాత్రం నోటీసులు అందుకుంటాం.