AI Trading News: ఆర్టిఫిషియల్ ఇంయెలిజెన్స్ (AI) ద్వారా ట్రేడింగ్ ఎలా చేస్తారు? దీన్ని నిజంగా డబ్బుగా మార్చవచ్చా? ఈ ప్రశ్నలకి సంచలనాత్మక సమాధానం ఇచ్చేలా ఓ Reddit యూజర్ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అతని కథనం ప్రకారం, అతను కేవలం 10 రోజుల్లో రూ.34,000 (సుమారు $400) డబుల్ చేశాడు. దీనిని ఎఐ టూల్స్ తో సాధించానని అన్నారు. ChatGPT, Grok అనే AI టూల్స్‌తో సాధించానని అతను తెలిపాడు.
AI ట్రేడింగ్ ఎలా చేశాడు?
ఈ ట్రేడర్ అమెరికాలోని Robinhood అనే ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి, మొదట $400 పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత మార్కెట్ డేటా, టెక్నికల్ చార్ట్స్, ఆప్షన్ చైన్ స్క్రీన్‌షాట్లు, మ్యాక్రో ఎకనామిక్ సమాచారం మొదలైన వివరాలను ChatGPTకు ఇచ్చి “ఈ మార్కెట్ పరిస్థితుల్లో ఎలాంటి ట్రేడ్ పెట్టాలి?” అని అడిగాడు.
నాలుగో రోజున అతను పోర్టుఫోలియోను రెండు భాగాలుగా విడగొట్టి ఒక భాగాన్ని ChatGPTకి, మరొకదాన్ని Grokకి అప్పగించాడు. ఈ ప్రయోగాన్ని “AI షోడౌన్”గా పిలిచాడు. మొత్తం 10 ట్రేడింగ్ రోజుల్లో అతను 18 ట్రేడ్లు పెట్టగా, వాటిలో 17 ట్రేడ్లు ముగించాడు. విజయ శాతం 100 శాతం వచ్చింది.
ChatGPT ద్వారా 13 విజయవంతమైన ట్రేడ్లు
Grok ద్వారా 5 ట్రేడ్లు విజయం
“ఇప్పటివరకు AIలు నన్ను నిరాశపరచలేదు” అంటూ అతను చెప్పడం ద్వారా, ఈ ప్రయోగం ఇంకా 6 నెలలు కొనసాగిస్తానని చెప్పాడు. అలాగే, తాను ఉపయోగించిన ప్రాంప్ట్‌లు, డేటాను కూడా Redditలో పంచుకున్నాడు.
నిపుణుల హెచ్చరికలు పెరిగాయి
ఈ పోస్ట్ ఇంటర్నెట్‌లో పెద్ద చర్చకు దారి తీసింది. చాలా మంది దీనిని రియల్ గేమ్ ఛేంజర్గా చూస్తున్నా, కొంతమంది మాత్రం దీన్ని అత్యంత రిస్క్ ఫుల్ ట్రెండ్ గా హెచ్చరిస్తున్నారు. Redditలో ఓ యూజర్ ఇలా వ్యాఖ్యానించాడు.. “ఇది అంత ఈజీ అయితే అందరూ చేస్తారు. ఇది స్కామ్ అయ్యే అవకాశముంది.”
ఇంకొకరు రాశారు.. “AIతో ట్రేడింగ్ అంటే మామూలు విషయం కాదు. ముందు పెట్టుబడులపై అవగాహన ఉండాలి. కేవలం సూచనలతో గెలవడం సాధ్యం కాదు.”
నిపుణులు చెబుతున్నదేమిటంటే.. ఇది స్వల్పకాలిక లాభమే, దీంతో AIని పూర్తిగా నమ్మి పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం. మార్కెట్ పరిస్థితులు ఎప్పుడైనా మారవచ్చు. AI కొన్ని సందర్భాల్లో సాయం చేయగలిగినా, అది మానవ అనుభవాన్ని పూర్తిగా భర్తీ చేయదు అంటున్నారు.