- ద్రవ్యోల్బణంలో ఖర్చులను తగ్గించడానికి ఇది పాటించండి
- ఇది మీ భవిష్యత్తుకు ఆర్థిక భద్రతను ఇస్తుంది
ఇటీవల ద్రవ్యోల్బణం పెరిగిందనే వార్తలను వింటూనే ఉన్నాం. దీని నియంత్రించేందుకు ఆర్బిఐ వడ్డీ రేట్లను పెంచుతోంది. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం మీ ఆదాయాలు, పొదుపు విలువను నిరంతరం తగ్గిస్తూ వస్తోంది. అటువంటి పరిస్థితిలో ఖర్చును తగ్గించడం ద్వారా పొదుపు చేయాలి. ఇది పాటించకుండా మీ భవిష్యత్తును సురక్షితం ఉండడం సాధ్యం కాదు. అందుకే ప్రస్తుత కాలంలో మీరు 50:30:20 నియమాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. ఇది చాలా సులభం, పన్నులు చెల్లించిన తర్వాత మిగిలిన మొత్తం ఆదాయంలో 50 శాతం అవసరమైన వస్తువులపై ఖర్చు చేయండి. మీ కోరికలను నెరవేర్చుకోవడానికి 30 శాతం ఉపయోగించండి, కనీసం 20 శాతం ఆదా చేయండి. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ద్రవ్యోల్బణం నియంత్రణ స్థాయిలో (2-5%) ఉంటే ఈ నియమం అనువైనది. ప్రస్తుతం దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6-7 శాతం వద్ద ఉంది. ఒకవేళ పెరిగితే ఆర్బిఐ రెపో రేటును పెంచుతుంది. వడ్డీ రేట్లలో నిరంతర పెరుగుదల ఉంటే మాత్రం రుణం ఇఎంఐ(EMI) కూడా పెరుగుతుంది. ఈ పరిస్థితిలో ఇతర ఖర్చులను తగ్గించడం ద్వారా 20 శాతం కంటే ఎక్కువ పొదుపు చేయాల్సిన అవసరం ఉంది. ఇది చేయడం కష్టం, కానీ అసాధ్యం మాత్రం కాదు.
షేర్లలో పెట్టుబడి పెట్టే ముందు..
ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభిస్తుంది. దీంతో పలు కంపెనీలకు రుణం భారం కావడం వల్ల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అటువంటి పరిస్థితిలో, ఏదైనా స్టాక్‌లో డబ్బును పెట్టుబడి పెట్టే ముందు, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న రేట్లు కంపెనీ వ్యాపారంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయో చూడండి. ద్రవ్యోల్బణం కారణంగా కొన్ని కంపెనీల ఉత్పత్తులు ఖరీదైనవి అవుతాయి, దీంతో డిమాండ్ తగ్గుతుంది.
నిజమైన రాబడిని ఇచ్చే పథకాలలో పెట్టుబడి
మీరు పొదుపు చేయడం ద్వారా ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించినప్పుడే నిజమైన రాబడి వస్తుంది. మీరు ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి బ్యాంక్ ఎఫ్డీలు, ఇతర పథకాలతో తగినంత రాబడిని పొందలేరు. అటువంటి పరిస్థితిలో మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ పథకాలలో పెట్టుబడిని పెంచాల్సిన అవసరం ఉంటుంది. మీరు సిప్(SIP) చేస్తే అది కూడా పెంచవలసి ఉంటుంది.
ప్రతికూల రాబడి…
మీరు మీ పెట్టుబడిపై ద్రవ్యోల్బణం రేటు కంటే తక్కువ రాబడిని పొందినప్పుడు, దానిని ప్రతికూల రాబడి అంటారు. మీరు బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) చేసారని అనుకుందాం, దానిపై మీరు 5% వార్షిక రాబడిని పొందుతున్నారు, కానీ రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 7%కి దగ్గరగా ఉంది. అంటే, ద్రవ్యోల్బణం రేటుతో పోలిస్తే మీరు మీ పెట్టుబడిపై 2% తక్కువ రాబడిని పొందుతున్నారు.
అనవసరమైన ఖర్చులు
అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవాలి. వీటిలో థియేటర్‌లో సినిమా చూడటం, రెస్టారెంట్‌లో డిన్నర్ చేయడం, లాంగ్ డ్రైవ్‌కు వెళ్లడం వంటివి ఉన్నాయి. మీరు ఈ విషయాలపై ఎంత ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవడానికి మీరు బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లను తనిఖీ చేయవచ్చు. ఏ ఖర్చులను తగ్గించవచ్చో ఇది స్పష్టం చేస్తుంది.