మీరు ఇటిఎఫ్ లేదా ఎఫ్ఒఎఫ్ లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి?
భవిష్యత్ భద్రత కోసం ఇప్పటి నుంచే సురక్షితమైన పెట్టుబడి పెడితే, మంచి రాబడిని అందుకోవచ్చు. దీనికి బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్ వంటి వాటిని ఎంపిక చేసుకుంటారు. ఇటువంటిదే కొంత భిన్నమైన పథకం ఉంది. అదే భారత్ బాండ్ ఇటిఎఫ్.. ఇది మ్యూచువల్ ఫండ్ వంటిదేనా? లేక కాదా? అనే సందేహాలు అందరిలో ఉన్నాయి. ఇతర బాండ్ ఇటిఎఫ్‌ల మాదిరిగానే భారత్ బాండ్ ఇటిఎఫ్ కూడా 2019 డిసెంబర్ లో ఎడెల్‌వీస్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీచే ప్రారంభించిన డెట్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఈ బాండ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు బాండ్ల గురించి, అవి ఎలా పని చేస్తాయనే దాని గురించి మీకు తగినంత అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం, పబ్లిక్ లేదా ప్రైవేట్ రంగ సంస్థలు సాధారణంగా ఫిక్స్ డ్ మెచ్యూరిటీ, వడ్డీ రేటుతో డబ్బును సేకరించేందుకు గాను ఈ బాండ్లను జారీ చేస్తాయి. ఒక వ్యక్తి లేదా సంస్థాగత పెట్టుబడిదారు ప్రైమరీ మార్కెట్ల నుండి మాత్రమే బాండ్లను కొనుగోలు చేయాలి. ఆ తర్వాత ఆ బాండ్లను బిఎస్ఇ, ఎన్ఎస్ఇ వంటి సెకండరీ మార్కెట్లలోని స్టాక్‌బ్రోకర్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వాటిని అమ్మవచ్చు. బాండ్ ఇటిఎఫ్ అనేది బాండ్‌లు లేదా టి-బిల్స్ వంటి స్థిరమైన ఆదాయ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే ఒక రకమైన ఫండ్ వంటిదే. దేశంలో అనేక బాండ్ ఈటీఎఫ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇతర ఇటిఎఫ్ ల కంటే వీటికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారెందుకు? వీటిలో ఎప్పుడు? ఎలా? పెట్టుబడి పెట్టాలో తెలుసుకుందాం.
భారత్ బాండ్ ఇటిఎఫ్ అంటే ఏమిటి?
ప్రభుత్వం ఆమోదంతో ఎడెల్‌వీస్ ఎఎంసి 2019లో ఈ భారత్ బాండ్ ఇటిఎఫ్‌ను ప్రారంభించింది. ఇది ముఖ్యంగా సిపిఎస్‌ఇలు, సిపిఎస్‌యులు, సిపిఎఫ్‌ఐలు, ఇతర ప్రభుత్వ సంస్థల బాండ్‌లతో పాటు ఎఎఎ రేటెడ్ ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడి పెడుతుంది. ఇటిఎఫ్ స్థిరమైన కాలపరిమితి, ఆకర్షణీయమైన వడ్డీ రాబడి ఇస్తుంది. మీరు సింగిల్ లేదా లంప్సమ్ పెట్టుబడి పెట్టవచ్చు. సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ద్వారా పెట్టుబడి చేయొచ్చు. డీమ్యాట్ ఖాతాతో యూనిట్లను మెచ్యూరిటీకి ముందు ఎప్పుడైనా మార్కెట్‌లో విక్రయించవచ్చు. ఇది నిఫ్టీ భారత్ బాండ్ ఇండెక్స్ మాదిరిగా ఉంటుంది. వివిధ మెచ్యూరిటీ, వడ్డీ రేట్లతో పెట్టుబడి పెట్టడానికి ప్రస్తుతం వివిధ రకాల భారత్ బాండ్ ఇటిఎఫ్ లు అందుబాటులో ఉన్నాయి. సిరీస్-4లో అందుబాటులో ఉన్న ఇటిఎఫ్‌ల జాబితా ఇలా ఉంది..
కాలపరిమితి —-ఇటిఎఫ్ దశ—- ట్రేడ్ కోడ్/ సింబల్—-రాబడి (2021 అక్టోబర్ నాటికి)
స్వల్పకాలికం—– భారత్ బాండ్ ఇటిఎఫ్ 2023 EBBETF0423—— 4.38%
స్వల్పకాలికం—— భారత్ బాండ్ ఇటిఎఫ్ 2025 EBBETF0425——- 5.28%
దీర్ఘకాలికం——-భారత్ బాండ్ ఇటిఎఫ్ 2030 EBBETF0430—— 6.76%
దీర్ఘకాలికం——- భారత్ బాండ్ ఇటిఎఫ్ 2031 EBBETF0430——– 6.80%
మీరు భారత్ బాండ్ ఎందుకు పెట్టుబడి పెట్టాలి?
భారత్ బాండ్ ఇటిఎఫ్ లో ఎలా పెట్టుబడి పెట్టాలి? వాటి ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.
పెట్టుబడి సులభం, డీమ్యాట్ ఖాతా తప్పనిసరి కాదు
మీకు డీమ్యాట్ ఖాతా ఉంటే బిఎస్ఇ, ఎన్ఎస్ఇ నుండి నేరుగా భారత్ బాండ్ ఇటిఎఫ్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. దీనిలో మెచ్యూరిటీకి ముందు ఎప్పుడైనా ఈ ఇటిఎఫ్ ని కొనుగోలు చేయవచ్చు. భారత్ బాండ్ ఇటిఎఫ్ ట్రేడ్ నేమ్ లేదా సింబల్ ‘ఇబిబిఇటిఎఫ్’తో మొదలై మెచ్యూరిటీ సంవత్సరంతో ముగుస్తుంది. ఉదా. EBBETF0430 గా ఉంటుంది. ప్రత్యామ్నాయంగా, మీరు డీమ్యాట్ ఖాతా లేకుండా కూడా పెట్టుబడి పెట్టవచ్చు. సిప్ లేదా లంప్సమ్‌తో పెట్టుబడిని అనుమతించే మ్యూచువల్ ఫండ్ అయిన భారత్ బాండ్ ఎఫ్ఒఎఫ్ (ఫండ్ ఆఫ్ ఫండ్)ని కూడా ఎడెల్‌వీస్ నడుపుతోంది. సిప్ తో భారత్ బాండ్ ఎఫ్ఒఎఫ్ కింద కనీస పెట్టుబడి మొత్తం రూ.500.
ఇది ఓపెన్-ఎండ్ ఫండ్ అంటే మీరు మీ హోల్డింగ్ యూనిట్‌లను రీడీమ్ చేసుకోవచ్చు, మెచ్యూరిటీకి ముందు ఎప్పుడైనా ఫండ్ నుండి నిష్క్రమించే అవకాశం ఉంటుంది. పాసివ్లీ నిర్వహించబడే ఫండ్ ఖర్చు నిష్పత్తిగా చిన్న మొత్తాన్ని వసూలు చేస్తుంది. ఇటిఎఫ్ కు 0.0005 శాతం, ఎఫ్ఒఎఫ్ కు కోసం 0.05 శాతం ఉంటుంది.
సిపిఎస్ఇ, సిపిఎస్యు, సిపిఎఫ్ఐతో సహా ప్రభుత్వ యాజమాన్య సంస్థలచే జారీ చేయబడిన ఎఎఎ రేటెడ్ అధిక-నాణ్యత బాండ్‌లలో భారత్ బాండ్ పెట్టుబడి పెడుతుంది. దేశంలో ఎఎఎ రేటెడ్ బాండ్‌లు అంటే జారీ చేసే సంస్థ ప్రాథమికంగా బలమైందని, డిఫాల్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువ అని అర్థం. సాధారణ బ్యాంక్ ఎఫ్డిల కంటే భారత్ బాండ్ నుండి మెరుగైన రాబడిని పొందవచ్చు. 2021 మార్చి ప్రకారం, భారత్ బాండ్ ఇటిఎఫ్ 2031 రాబడి సుమారు 7.12 శాతం.
భారత్ బాండ్ ఇటిఎఫ్, ఎఫ్ఒఎఫ్ స్వల్ప, దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపికలను అందిస్తుంది. స్వల్పకాలిక బాండ్ల కంటే దీర్ఘకాలిక బాండ్ ఇటిఎఫ్ ఎక్కువ వడ్డీ రాబడిని ఇస్తుంది. స్వల్పకాలిక పార్కింగ్ ఫండ్ కు భారత్ బాండ్ ఇటిఎఫ్ మంచి ఎంపికగా ఉంది. భారత్ బాండ్ ఇటిఎఫ్ దీర్ఘకాలిక పెట్టుబడి అంచనా వృద్ధి కాగర్ 6 నుండి 7 శాతం వరకు ఉంటుంది. ఇది బ్యాంక్ ఎఫ్డి వంటి ఇతర రుణ సాధనాలతో పోలిస్తే చాలా మెరుగైంది.
లిక్విడిటీ
లిక్విడిటీ కోసం భారత్ బాండ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఉత్తమం అని చెబుతారు. భారత్ బాండ్‌లో లాక్-ఇన్ వ్యవధి లేదు. మీ ఇటిఎఫ్ లేదా ఎఫ్ఒఎఫ్ ఉంటే మీరు కావలసినప్పుడు హోల్డింగ్స్ ను విక్రయింవచ్చు. మీరు జెరోదా వంటి స్టాక్ బ్రోకర్ ద్వారా స్టాక్ మార్కెట్ సెషన్‌లో ఇటిఎఫ్ షేర్లను కొనుగోలు చేయవచ్చు, లేదా విక్రయించవచ్చు. ఏడాదిలోపు ఎఫ్ఒఎఫ్ నుండి రిడెంప్షన్ కు 0.10 శాతం ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. ఇటిఎఫ్ షేరు ధర పడిపోయిన సందర్భంలో సగటు కోసం అదనపు యూనిట్లను కొనుగోలు చేయవచ్చు.
తక్కువ పన్ను భారం
భారత్ బాండ్ ఇటిఎఫ్ మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కలిగి ఉంటే ఎల్టిసిజి (దీర్ఘకాలిక మూలధన లాభం) పన్నుపై ఇండెక్సేషన్ ప్రయోజనం పొందుతారు. ఇండెక్సేషన్ ప్రయోజనం అంటే మీరు సగటు ద్రవ్యోల్బణం శాతాన్ని తీసివేసి లాభంపై పన్ను చెల్లించాలి. డెట్ ఫండ్స్ కు ప్రస్తుతం ఎల్టిసిజి 20 శాతం రేట్ ఉంది. అయినప్పటికీ షార్ట్-టర్మ్ క్యాపిటల్ గెయిన్‌లో అలాంటి ఆఫర్‌లు లేవు. మీరు మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం ఎస్టిసిజి పన్ను చెల్లించాలి.
భారత్ బాండ్‌లో ఎవరు పెట్టుబడి పెట్టాలి
సురక్షితమైన, మంచి రాబడిని కోసం చూసే పెట్టుబడిదారులు వారు పోర్ట్‌ఫోలియోలో కొంత భాగం భారత్ బాండ్ ఇటిఎఫ్, ఎఫ్ఒఎఫ్ లను పరిగణించవచ్చు. అధిక ఆదాయపు పన్ను పరిధిలో ఉన్న వ్యక్తులు ఇండెక్సేషన్ పన్ను ప్రయోజనాన్ని పొందడానికి ఈ రుణ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. లిక్విడిటీ వల్ల పెట్టుబడిదారులకు స్వల్పకాలిక ఫండ్ పార్కింగ్ ఈ ఇటిఎఫ్‌లో ప్రయోజనకరంగా ఉండనుంది.
భారత్ బాండ్ ప్రయోజనాలు
- ఇటిఎఫ్ ఎక్కువగా ఎఎఎ రేటెడ్ హై క్వాలిటీ పిఎస్యు సెక్యూరిటీలు, బాండ్లలో పెట్టుబడి పెట్టడం వలన భారత్ బాండ్ క్రెడిట్ రిస్క్ తక్కువగా ఉంటుంది.
- ఫండ్ ఖర్చు నిష్పత్తి 0.05 శాతం చాలా తక్కువగా ఉంది. ఎఫ్ఒఎఫ్ ఒక సంవత్సరం పూర్తయ్యేలోపు రిడెంప్షన్ విషయంలో 0.10 శాతం ఎగ్జిట్ లోడ్‌ను కలిగి ఉంటుంది.
- ఎక్స్ఛేంజ్ ట్రేడ్ ఫండ్ కావడం వల్ల భారత్ బాండ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఇటిఎఫ్)కి లాక్ ఇన్ వ్యవధి లేదు
- ఇతర బాండ్‌లు, మ్యూచువల్ ఫండ్‌ల కంటే భారత్ బాండ్ ఇటిఎఫ్, ఎఫ్‌ఓఎఫ్ అందించే లిక్విడిటీ అధికంగా ఉంటుంది.
భారత్ బాండ్‌తో రిస్క్ లు
ధర లేదా వడ్డీ రేటు రిస్క్ ఉంటుంది. బాండ్ ధర, వడ్డీ రేటు మధ్య సంబంధం వ్యతిరేకంగా ఉంటుంది. బాండ్ల ధర పెరిగినప్పుడు వడ్డీ రేటు తగ్గుతుంది. మరొక అధిక వడ్డీ రేటు బాండ్‌ను ప్రవేశపెట్టడం ఎన్ఎవి తరుగుదలకు కారణం కావచ్చు. స్టాక్ మార్కెట్‌లో ఇటిఎఫ్ ట్రేడ్ కావడం వల్ల భారత్ బాండ్ ఇటిఎఫ్ రేటు మారుతూ ఉంటుంది.
- క్రెడిట్ రిస్క్ ఉంటుంది. బాండ్ జారీ చేసిన సంస్థ డిఫాల్ట్ లేదా దివాలా తీసినట్లయితే మూలధన నష్టం రావొచ్చు. అయితే ప్రభుత్వ సంస్థల డిఫాల్ట్ చాలా తక్కువ.
- ఏదైనా కారణం వల్ల ఫండ్ ఎన్ఎవి తగ్గినప్పుడు, రీఇన్వెస్ట్‌మెంట్ భాగం కూడా తగ్గుతుంది. ఇది కాగర్, ఎక్స్ఐఆర్ఆర్ ని ప్రభావితం చేస్తుంది.
- లిక్విడిటీ రిస్క్ సమస్య ఉంది. కొనుగోలుదారుల కొరత కారణంగా మీ హోల్డింగ్‌లను విక్రయించలేరు. స్టాక్ మార్కెట్ పెరిగినప్పుడల్లా ఈ పరిస్థితి కనిపిస్తుంది.
ఎంత పెట్టుబడి పెట్టొచ్చు..
యాంకర్ ఇన్వెస్టర్ రూ. 10 కోట్లు మాత్రమే, మల్టిపుల్ లో రూ.1000 ఉంటుంది కావున
వ్యక్తిగత పెట్టుబడిదారు రూ. 1,000, గరిష్ట పెట్టుబడి మొత్తం రూ. 2,00,000 మాత్రమే
రిటైర్మెంట్ ఫండ్స్ వారికి రూ. 2,01,000, అలాగే క్యూఐబిలకు రూ. 2,01,000
సంస్థాగత యేతర ఇన్వెస్టర్లు (ఎన్ఐఐ) రూ. 2,01,000
భారత్ బాండ్ ఇటిఎఫ్, ఎఫ్ఒఎఫ్ లో పెట్టుబడి ఎలా..
భారత్ బాండ్ ఇటిఎఫ్ దరఖాస్తు చేసుకోవడం చాలా సులభతరంగా ఉంటుంది. మీరు డీమ్యాట్ ఖాతా, క్లయింట్ ఐడిని కలిగి ఉంటే ప్రత్యక్షంగా ఎడెల్వీస్ ఎఎంసి నుండి భారత్ బాండ్ ఇటిఎఫ్లో పెట్టుబడి పెట్టవచ్చు. మరో రంకా అంటే మార్కెట్ సమయాలలో సెకండరీ మార్కెట్ నుండి ఇటిఎఫ్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. డీమ్యాట్ ఖాతా లేకపోతే ఒక వ్యక్తి భారత్ బాండ్ ఎఫ్ఒఎఫ్ (ఫండ్ ఆఫ్ ఫండ్) కింద పెట్టుబడి పెట్టవచ్చు.