కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్న వారైతే.. కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి
మ్యూచువల్ ఫండ్స్ తరచూ వినిపిస్తున్న మాట. ఇటీవల వీటికి డిమాండ్ బాగా పెరిగింది. ప్రజలు కూడా వీటిలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. చాలా మంది తమ కలలను నెరవేర్చుకునేందుకు మ్యూచువల్ ఫండ్స్ సరైనవి అని భావిస్తున్నారు కూడా. స్టాక్ మార్కెట్ అస్థిరతతో సంబంధం లేకుండా చాలా మంది మ్యూచువల్ ఫండ్లలో క్రమం తప్పకుండా పెట్టుబడి పెడుతున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ బేసిక్స్ మాత్రం తెలుసుకోకుండా ఇన్వెస్టే చేయవద్దు. ఫండ్స్ లో పెట్టుబడి పెడితే ఇంత అవుతుంది.. అంత అవుతుంది అని చెప్తారు. కానీ ఫండ్స్ ప్రాథమిక విషయాల గురించి ఎవరూ చెప్పరు. మీరు కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్న వారైతే.. కొన్ని ముఖ్యమైన విషయాలను మాత్రం తెలుసుకోవాలి.
అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?
ఉదాహరణగా చెప్పాలంటే కొంతమంది నిర్వాహకులు లక్షలాది మంది తరఫున డబ్బును సేకరించి, ఆ డబ్బును వివిధ పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ నిర్వాహకులు అంటే నిపుణులు. వారు ఏది సురక్షితమో తెలుసుకొని, మన దగ్గర కొంత ఫీజు తీసుకుని, మన డబ్బును వృద్ధి చేస్తారు. ఫండ్స్ నిర్వాహకులు బాండ్లు, స్టాక్‌లు (భారతీయ, విదేశీ), బంగారం వంటి వస్తువులలో పెట్టుబడి పెడతారు. వీటినే మ్యూచువల్ ఫండ్స్ అంటారు.
మ్యూచువల్ ఫండ్స్ లో రకాలు
- ఈక్విటీ ఫండ్స్ అయితే స్టాక్‌లలో పెట్టుబడి పెడతారు.
- డెట్ ఫండ్ అయితే బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తారు.
- గోల్డ్ ఫండ్ అయితే బంగారంలో పెట్టుబడి పెడతారు.
- ఈక్విటీలు, బాండ్లు రెండింటిలో పెట్టుబడి పెట్టే వాటిని హైబ్రిడ్ ఫండ్‌లుగా పిలుస్తారు.
- ఇక విదేశీ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టే స్కీమ్ లు కూడా ఉన్నాయి. ఇలా ఫండ్స్ లో రకరకాల పెట్టుబడులు ఉంటాయి. వీటిలో ఏది మనకు బాగుంటుంది అనుకుంటే వాటిలో ఇన్వెస్ట్ చేయాలి.
పూర్తి వివరాలను తెలుసుకోవాలి
- బ్యాంకులు, ఇతర సంస్థల తరఫున చెప్పేవారు, తాము వీటిలో ఇన్వెస్టే చేశామని చెబుతారు. వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకోకుండానే వినియోగదారులు వాటిలో ఇన్వెస్టే చేస్తారు. ఏదైనా బ్యాంక్ తరఫునా, లేదా ఫండ్ హౌస్ తరఫున చెప్పినప్పటికీ స్వీయ విశ్లేషణ, వాటి గురించి నిపుణుల అభిప్రాయం తీసుకోవాలి.
- ఈ రోజుల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) బాగా పాపులర్ అయింది. వాటిలో ఇన్వెస్ట్ చేయడం మంచిది అని చెబుతున్నారు. మార్కెట్లో వేలాది ఫండ్స్ ఉన్నాయి. సరైన వృద్ధిని ఇస్తున్నది ఏమిటో తెలుసుకోవాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.
- కొన్ని నెలలు లేదా స్వల్ప కాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారు అయితే లిక్విడ్ ఫండ్స్ వంటి డెట్ మ్యూచువల్ ఫండ్‌లను ఎంచుకోవాలి
- కనీసం 20 సంవత్సరాల పాటు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను కల్గివుంటే, అంటే ఎక్కువ కాలం పాటు వేచి ఉండేవారైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ను ఎంపిక చేసుకోవాలి.
మ్యూచువల్ ఫండ్స్ వల్ల ప్రయోజనాలేమిటి..
- మ్యూచువల్ ఫండ్స్‌లో ఉండే సౌలభ్యం ఏమిటంటే రూ.500 వంటి చిన్న మొత్తంతో కూడా పెట్టుబడి పెట్టేందుకు అనుమతి ఇస్తారు.
- తక్కువ ఫీజులతో ఫండ్ మేనేజర్ సేవలను పొందే అవకాశం. అలాగే మీ పెట్టుబడుల నిర్వహణపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ చిన్న ఫీజుతో వాటిని ఎప్పుడూ పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు.
SIP లో ఈ తప్పులు చేయొద్దు
ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్ లో SIP బాగా పాపులర్ అయింది. SIP ద్వారా పెట్టుబడులు పెట్టి మంచి లాభాలను పొందుతున్న వారు ఉన్నారు. అయితే సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ముందు దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. ఎందుకంటే వివరాలను తెలుసుకోకపోవడం వల్ల చాలా మంది పెట్టుబడిదారులు కొన్ని తప్పులు చేస్తారు. దీంతో వారు నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ తప్పులేమిటో ఓసారి తెలుసుకుందాం.
- మీ పెట్టుబడిపై స్పష్టమైన దూరదృష్టి, అవగాహన, సరైన లక్ష్యం ఉండాలి. స్పష్టత లేకపోతే తప్పు ఫండ్‌ని ఎంచుకునే అవకాశం ఉంది.
- గ్రోత్ కు బదులుగా డివిడెండ్ ప్లాన్ ను ఎంపిక చేసుకోవడం వంటి తప్పిదాలు చేయొద్దు. ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్ డివిడెండ్ ప్రకటించినప్పుడు, ఎక్కువ మొత్తంలో డబ్బును సంపాదిస్తామని భావిస్తారు.
- చాలా మంది పెట్టుబడిదారులకు తెలియనిది ఏమిటంటే మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న వారి అసెట్స్ నుండి డివిడెండ్లను చెల్లిస్తాయి. ఇది ఫండ్ ఎన్ఎవి నుండి చెల్లించిన డివిడెండ్‌ని తీసివేస్తుంది. అలాగే డివిడెండ్ ఫండ్ ఫేస్ వాల్యూ విలువపై లెక్కిస్తారని, ఎన్ఎవి ఆధారంగా కాదని తెలుసుకోవాలి.
- అలాగే గ్రోత్ ప్లాన్లలో పెట్టుబడిదారులు కూడా పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయం గమనించాలి.
- చాలా మంది పెట్టుబడిదారులు మార్కెట్ పడిపోతున్నప్పుడు SIP ని ఆపేసి, మార్కెట్ పెరిగినప్పుడు పెట్టుబడి పెడతారు. కానీ తప్పు మార్కెట్ క్షీణించినప్పుడు తక్కువకే కొని, ఆ తర్వాత పెరిగినప్పుడు అమ్మేయాలి. ఈ ప్రాథమిక సూత్రాన్ని తప్పనిసరిగా పాటించాలి. పతనం అవుతున్న మార్కెట్లలో కూడా పెట్టుబడిని కొనసాగించాలి.
- మార్కెట్ హెచ్చుతగ్గులను పట్టించుకోవద్దు. ఏది ఎంత సమయం, ఏ ఫండ్ అనేది నిర్ణయించుకుని పెట్టుబడి పెట్టాలి. ఈ విధంగా మీరు సరైన ఫండ్‌ని ఎంచుకోవాలి. తద్వారా దానికి కొనసాగించాలి.
- మ్యూచువల్ ఫండ్స్ ను తరచూ మార్చడం వంటివి చేయొద్దు. ఎక్కువగా ఫండ్ గత పనితీరు ఆధారంగా ఇన్వెస్ట్ చేస్తారు. ఇదే సరే కానీ, ఫండ్ రాబడులు ఎప్పుడూ ఓకే విధంగా ఉండబోవు, మారుతూనే ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలి.
- ఫండ్ అధిక, తక్కువ ఎన్ఎవికి అనేక కారణాలు ఉంటాయి. తక్కువ ఎన్ఎవి (నికర ఆస్తి విలువ) ఉన్నవాటిని చౌక ఫండ్‌లుగా భావించి తీసుకోవద్దు. ఎప్పుడైనా ఫండ్ పనితీరు ఆధారంగానే ఎంపిక ఉండాలి. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకోవాలి. SIP ల ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే ఎన్ఎవి గురించి పట్టించుకోవద్దు.
FD కంటే అధిక రాబడినిచ్చే డెట్ మ్యూచువల్ ఫండ్స్