ఈరోజుల్లో ఆసుపత్రి ఖర్చులు భరించలేం.. హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే..

Spread the love

ఆకస్మిక పరిస్థితులు వస్తే దీని అవసరం తెలుస్తుంది.. ఆరోగ్య బీమాతో జీవితానికి ధీమా నిజమే..

ఈ కాలంలో ప్రతిఒక్కరికీ ఆరోగ్య బీమా తప్పనిసరి. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత దీని అవసరం అందరికీ తెలిసొచ్చింది. సరైన జీవనశైలి, సమతుల్య ఆహారంతో పాటు ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతో ముఖ్యమో ఆసుపత్రులకు వెళ్లిన వారికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో హాస్పిటల్ ఖర్చులు సామాన్యులు భరించలేని స్థితిలో ఉన్నాయి. వైద్య చికిత్స, మెడిసిన్ లకు లక్షల రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తోంది. దీని నుంచి బయటపడాలంటే సురక్షిత మార్గం హెల్త్ ఇన్సూరెన్స్, దీంతో ఆరోగ్యానికి కొంత ధీమా ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ఈ ఆరోగ్య బీమాలో అనేక రకాలు ఉన్నాయి. అలాగే చాలా సంస్థలు వివిధ పథకాలను అందిస్తున్నాయి.


ఎంత జాగ్రత్తగా ఉన్నా…

మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎప్పుడు ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయో చెప్పలేం. అకస్మాత్తుగా ఏం జరిగినా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ లక్షలు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. కాబట్టి ఈ కాలంలో ’ఆరోగ్య బీమా‘ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఒక తప్పనిసరి అవసరం. కరోనా వైరస్ సోకినవారు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరితే లక్షల రూపాయల బిల్లులవుతున్నాయి. ఆరోగ్య బీమా చేయించుకుంటే రకరకాల వ్యాధుల విషయంలో వైద్యం ఖర్చుల నుంచి మినహాయింపు దొరుకుతుంది. ఆస్పత్రిలో చేరితే ఎన్నో ఖర్చులుంటాయి. డాక్టర్లు రాసిన మందులకు అయ్యే ఖర్చు, డాక్టర్ ఫీజులు, వైద్య పరీక్షలు, ఆపరేషన్ వ్యయం, ఆస్పత్రిలో ఉన్నందుకు చెల్లించే అద్దె వంటి వ్యయాలు ఉంటాయి. ఈ ఖర్చుల్ని ఆరోగ్య బీమా సంస్థ భరిస్తుంది. ఇందులో రెండు పద్ధతులున్నాయి. 1. బీమా కంపెనీ నేరుగా ఆ ఆస్పత్రికి బిల్లు మొత్తాన్ని చెల్లించడం. 2. బీమా చేసిన వ్యక్తి మొదట ఆ ఖర్చును భరిస్తే తర్వాత బిల్లుల్ని చూసి కంపెనీ చెల్లించడం. బీమా వల్ల బీమాదారుడికి ఎంతో ఖర్చు కలిసొస్తుంది.

వీటి గురించి ముందు తెలుసుకోండి..

పాలసీ తీసుకునేముందు కొన్ని విషయాల్ని తెలుసుకోవాల్సి అవసరం ఉంది. ఆరోగ్య బీమా పాలసీ ఎలా తీసుకోవాలి? ఏ వయసు వారు తీసుకోవచ్చు? వయోపరిమితి ఉందా లేక ఎవరైనా తీసుకోవాచ్చా? ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఏ విధంగా క్లైమ్ చేయవచ్చు? పాలసీదారుడిగా చేరడానికి ఎలాంటి పత్రాలు ఇవ్వాలి? ఏ కంపెనీలు మంచి పాలసీల్ని అందిస్తున్నాయి. ఈ విషయాలపై ఒక అవగాహనకు వచ్చాక ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవవడం మంచిది.

ఏ వ్యాధులకు బీమా కవరేజ్ ?

చాలా తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులకు, సాధారణ రోగాలకు వాటికి ఎంత వ్యయమైనా బీమా కంపెనీలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నాయి. అరిగిన ఎముకల మార్పిడి, బై పాస్ సర్జరీలు, శరీరావయవాలు కోల్పోవడం, హార్ట్ ఎటాక్, మూత్రపిండాలు పనిచేయకపోవడం (కిడ్నీ ఫెయిల్యూర్) . ఇంకా ఇతర అనారోగ్యాలు, వ్యాధుల చికిత్సకు అయ్యే ఖర్చును బీమా కంపెనీలు భరిస్తాయి. అంటే మెడికల్ రీ ఎంబర్స్ మెంట్ అన్నమాట. ఏఏ వ్యాధులకు బీమా సదుపాయం ఉంటుందో తెలిపే లిస్ట్ పాలసీ ఫారాలలో ఉంటుంది. ఖర్చు గురించి ఆందోళన చెందకుండా రోగి ఉత్తమ వైద్య సహాయం పొందేందుకు వైద్య బీమా వీలుకల్పిస్తుంది.

పన్ను మినహాయింపులు

వైద్య బీమాకు కొన్ని పన్ను మినహాయింపులు కూడా ఉంటాయి. మంచి హెల్త్త ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఆరోగ్య సంరక్షణ పథకాలకోసం చెల్లించే ప్రీమియంకు పన్ను మినహాయింపు, తద్వారా చేకూరే ప్రయోజనాలు ఉంటాయి.

ఆరోగ్య బీమా వల్ల కలిగే మరో లాభం ఏమిటంటే… 3-5 క్లెయిమ్ సంవత్సరాల తర్వాత కూడా కంపెనీకి నమోదు అయిన ఆస్సత్రులు, క్లినిక్ లలో రెగ్యులర్ గా ఉచిత వైద్య పరీక్షల్ని అందిస్తుంది. బీమా చేసిన వ్యక్తి ఒకవేళ ఇతర చోట్ల వైద్య పరీక్షలు చేయించుకున్నా అక్కడ అయ్యే ఖర్చుల్ని కూడా కంపెనీ భరిస్తుంది.

ఇంకో విశేషమేంటంటే అటెండెంట్ అలవెన్స్. ఒకవేళ పేషెంట్ చిన్న పిల్లవాడు అయినా, లేక సీనియర్ సిటిజన్ అయినా ఆ పేషెంట్ తరఫున అటెండ్ అయ్యే వ్యక్తికి అయ్యే ఖర్చుల్ని కూడా చాలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తాయి. అయితే, ట్రీట్ మెంట్ ప్రారంభించే ముందే ఆ అటెండెంట్ పేరును పేర్కొనాలి. ఒక అటెండెంట్ కంటే ఎక్కువ మంది ఉండకూడదు.

అవయవ దాతల బిల్స్

మూత్రపిండాల మార్పిడికి (కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్) దాదాపు 3 నుంచి 5 లక్షల వరకూ ఖర్చవుతుంది. కిడ్నీ దాతలకు చాలా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. బీమా చేసి ఉంటే ఆ వ్యయానికి ఆందోళన చెందక్కర్లేదు. హెల్త్ కేర్ ప్లాన్ కింద జనరల్, మరియు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ ఖర్చును పెట్టుకుంటాయి. సర్జరీ తర్వాత కొన్ని కంపెనీలు రీ ఎంబర్స్ చేస్తాయి. అంటే సర్జరీకి అయిన మొత్తాన్ని క్లయింట్ కు చెల్లిస్తాయి. కొన్ని కంపెనీలైతే మొత్తం అవయవ మార్పిడి చికిత్సకు, అవయవానికి అయ్యే ఖర్చును నగదు రహిత పద్ధతిలో చెల్లిస్తాయి. అయితే అవయవ దాత (డోనర్) ఆస్పత్రి ఖర్చులు. ఇతర వ్యయాలను ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదు. కానీ ఇందువల్ల పాలసీదారునికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

చికిత్సలకు ఇన్సూరెన్స్ కంపెనీలపై ఆధారపడిన హాస్పిటల్స్, క్లినిక్ ల నెట్ వర్క్ అందుబాటులో ఉంటుంది. దీంతో ఆరోగ్య బీమా పాలసీదారులు ఆయా ఆస్పత్రుల్లో బీమా సదుపాయాన్ని పొందవచ్చు.

https://telugupaisa.com/%e0%b0%b8%e0%b0%b0%e0%b1%88%e0%b0%a8-%e0%b0%b9%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%87%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%82%e0%b0%b0%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d/


Spread the love

Leave a Comment

error: Content is protected !!